Revanth Reddy Fire on PM Modi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపే తీర్మానంపై మోదీ ప్రసంగించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై అనుసరించిన తీరును పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తప్పు బట్టారు. ఇందుకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మను దగ్దం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన దిష్టిబొమ్మను ఎక్కడికక్కడ దహనం చేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు.
తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. నరేంద్రమోదీ ప్రజా ఉద్యమాల ద్వారా ఎదగలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అరుణ్‌జైట్లీని మేనేజ్ చేసి మోదీ పదవులు పొందారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అని భాజపా తీర్మానం చేయలేదా అని ప్రశ్నించారు. 1999లోనే తెలంగాణ ప్రాంతంలో భాజపా 4 ఎంపీ సీట్లు గెలిచిందన్న ఆయన... తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పి వాజ్‌పేయి మోసం చేశారన్నారు. వాజ్‌పేయి 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసి తెలంగాణకు మొండిచేయి చూపారని గుర్తుచేశారు.
భాజపాయే కారణం...
ఎన్డీఏ తొలి ప్రభుత్వమే తెలంగాణ ఏర్పాటు చేసి ఉంటే వందలమంది ప్రాణాలు పోయేవి కాదని రేవంత్‌రెడ్డి అన్నారు. వందలమంది ఆత్మబలిదానాలకు ఒక రకంగా భాజపాయే కారణమని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రా నాయకుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా... సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని కొనియాడారు. ఒక ప్రాంతంలో పూర్తిగా నష్టపోతామని తెలిసినా తెలంగాణ ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు. కీలక బిల్లుపై ఓటింగ్ జరిగేటప్పుడు తలుపులు పెట్టడం ఎప్పుడూ జరిగేదేనన్నారు.
1999లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసింది. 1999 నుంచి 2004 మధ్యలో ఎన్డీఏ ప్రభుత్వం మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. కానీ తెలంగాణను ఏర్పాటు చేయలేదు. తెలంగాణ ప్రజల త్యాగాలను, పోరాటాలను భాజపా అవమానించింది. నరేంద్రమోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. మీరు కాకినాడ తీర్మానం ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకునేవారు కాదు. వారి మరణాలకు భాజపానే కారణం.
-- రేవంత్‌రెడ్డి, ఎంపీ
దిగజారిన ప్రధాని...
ప్రధాని మోదీకి పార్లమెంటు సంప్రదాయాలు కూడా తెలియవని ఆరోపించారు. బిల్లుపై చర్చ అవసరం లేదు, వెంటనే ఆమోదించండి అని సుష్మాస్వరాజ్ అన్నారని గుర్తుచేశారు. రాజ్యసభలో అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు సుదీర్ఘంగా మాట్లాడారన్న ఆయన... రాష్ట్ర విభజన బిల్లులో వెంకయ్యనాయుడు ఎన్నో సవరణలు సూచించారని తెలిపారు. సోనియాగాంధీ త్యాగాల మీద తెలంగాణ ఏర్పడిందని రేవంత్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామని ఏపీని కూడా మోదీ మోసం చేశారన్నారు. రాజకీయ లబ్ధి కోసం మోదీ దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రకటించిన ఐటీఐఆర్‌ను భాజపా రద్దు చేసిందన్నారు.
ఆంధ్రా నాయకుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా... సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఒక ప్రాంతంలో పూర్తిగా నష్టపోతామని తెలిసినా తెలంగాణ ఇచ్చారు. కీలక బిల్లుపై ఓటింగ్ జరిగేటప్పుడు తలుపులు పెట్టడం ఎప్పుడూ జరిగేదే. ప్రధాని మోదీకి పార్లమెంటు సంప్రదాయాలు కూడా తెలియవు. బిల్లుపై చర్చ అవసరం లేదు, వెంటనే ఆమోదించండి అని సుష్మాస్వరాజ్ అన్నారు.
-- రేవంత్‌రెడ్డి, ఎంపీ
ఇదీ చూడండి: విభజన తీరుతో ఏపీ, తెలంగాణ ఇప్పటికీ నష్టపోతున్నాయి: మోదీ