India international travel mart expo: కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. దేశవ్యాప్తంగా వైరస్ బలహీన పడటం, కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా పర్యాటక ద్వారాలు తెరుచుకున్నాయి. రెండున్నరేళ్లుగా ఆదాయాలు, వ్యాపారాన్ని కోల్పోయిన సంస్థలు.. పలు రాష్ట్రాల నుంచి పర్యాటకులను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో హైదరాబాద్ హైటెక్స్‌లో ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ ఎక్స్‌పో ద్వారా దేశ పర్యాటక రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు సిద్ధమైంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఎక్స్‌పోను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు.. దేశంలోని 20 రాష్ట్రాల నుంచి టూరిజం శాఖలు, టూర్ ఆపరేటర్లు, ఆయా నగరాల్లోని ప్రముఖ హోటల్ నిర్వాహకులు పాల్గొంటున్నారు. తమ రాష్ట్రాల్లో ప్రధాన పర్యాటక ప్రాంతాలు.. తాము అందిస్తోన్న ఆకర్షణీయమైన ప్యాకేజీలను జౌత్సాహికులకు వివరిస్తున్నారు.
ప్రదర్శనలో రాష్ట్రాల పర్యాటక సంస్థలు
India international travel mart expo: హైటెక్స్‌లో నిర్వహిస్తోన్న ఈ ప్రదర్శనలో ఆయా రాష్ట్రాల పర్యాటక సంస్థలు... వారసత్వ కట్టడాలు, అక్కడి సాహస యాత్రలు, పర్యాటక సౌరభాన్ని తెలియజెప్పేలా తోరణాలు, చిత్రాలు సుందరంగా ఏర్పాటు చేశారు. టూరిస్టు ప్రదేశాల సందర్శనతో పాటు, అక్కడి ఆతిథ్యం, ఆహారం, సంస్కృతి సంప్రదాయాలను ప్రత్యేకంగా రూపొందించిన ప్యాకేజీలను.. ఏజెంట్లు వివరిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన టూరిజం అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సన్మానించారు. తెలంగాణలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటిని సందర్శించాలని వారిని ఆహ్వానించారు.
రామోజీ ఫిలిం సిటీ గురించి ప్రస్తావన
గత కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా కలవరం పుట్టిస్తున్న ఒమిక్రాన్ వేవ్‌పై... ఆయా రాష్ట్రాల పర్యాటక సంస్థలు భయాందోళనలను వ్యక్తం చేశాయి. కొవిడ్‌తో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతిని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమకు ఇదొక పెద్ద సవాల్ అని పలు రాష్ట్రాల పర్యాటక బోర్డులు తెలిపాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులకు భరోసానిచ్చేలా తమ సిబ్బందంతా పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నారని పర్యాటక సంస్థలు ప్రకటించాయి. పలు రాష్ట్రాలకు చెందిన పర్యాటక బోర్డుల అధికారులు.. రామోజీ ఫిలిం సిటీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పర్యాటకులను ఆకర్షించేలా..
మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పో ద్వారా వీలైనంత ఎక్కువ పర్యాటకులను తమ రాష్ట్రాలకు ఆకర్షించే వ్యాపారాన్ని ఆశిస్తున్నామని.. ఇందుకోసం ప్రత్యేకమైన ప్యాకేజీలు, ఆఫర్లను పరిశీలించాలని ఔత్సాహికులను కోరుతున్నారు.
ఇదీ చదవండి: