రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ వేదికగా రేపు సాయంత్రం కేబినెట్ భేటీ జరగనుంది. ప్రధానంగా ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, నీటిపారుదల అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక మాంద్యం కారణంగా కేంద్రం నుంచి కావాల్సిన నిధుల్లో తగ్గుదల, అందని ఐజీఎస్టీ నిధులు, పరిహారం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆ ప్రభావం, తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.
నిధుల తగ్గుదల నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణ, నియంత్రణ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. దుమ్మగూడెం వద్ద ఆనకట్ట నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అదనపు టీఎంసీ నీటి ఎత్తిపోత పనుల విషయమై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు పురపాలక ఎన్నికలు, శాసనసభ సమావేశాలు, ఇతర అంశాలపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు.
ఇదీ చూడండి: బంగారు టాయ్‌లెట్‌ను దొంగలెత్తుకెళ్లారు..!