బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొన్నారు. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. ఇది మరింత బలపడి సుమారుగా మే 7న ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు.
తదుపరి 48 గంటలలో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇది మే 7 వరకు వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని సంచాలకులు వివరించారు. రేపు, ఎల్లుండి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.