కూరగాయల సాగులో ఉత్పాదకత పెంపుపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో జనాభా అవసరాలకు అనుగుణంగా భారత వ్యవసాయ పరిశోధన మండలి(ICAR) ఆధ్వర్యంలో టమాట, వంకాయ కొమ్మలను అంటుకట్టి... ఒకే మొక్కకు ఒకేసారి రెండు రకాల కాయలు కాసేలా సరికొత్త ప్రయోగం చేసి విజయవంతమయ్యారు. ఐసీఏఆర్ ఆధ్వర్యంలోని వారణాశి కూరగాయల పరిశోధన సంస్థలో సంకరజాతి వంకాయ రకం కాశీ సందేశ్‌ను, టమాటా రకం కాశీ అమన్‌తో అంటుకట్టి ఒకే మొక్కకు ఒకేసారి రెండు రకాల కాయలు కాసేలా చేసింది. కొత్త మొక్కను 15 నుంచి 18రోజుల తర్వాత భూమిలో నాటి పరీక్షించారు.
మొక్క తొలిదశలో వంకాయ, టమోటా కొమ్మలు సమతౌల్యంగా పెరిగేలా చర్యలు తీసుకున్నారు. హెక్టార్‌కు 25 టన్నుల సేంద్రియ ఎరువుతో పాటు రసాయన ఎరువు (ఎన్‌పీకే 150:60:100)ను కిలో మేరకు వేసి పరీక్షించారు. ఇలా అంటుకట్టిన కొత్తమొక్కల్లో 60 నుంచి 70 రోజుల తర్వాత వంకాయ, టమాటా కాయడం ప్రారంభమైనట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రయోగాత్మక దశలో ఒక్కో మొక్కకు సగటున 2.383 కిలోల టమాటాలు, 2.684 కిలోల వంకాయలు కాసినట్లు తెలిపారు.
గతంలో బంగాళాదుంప - టమాటా అంకు కట్టు విధానం సఫలమైన నేపథ్యంలో తాజాగా శాస్త్రవేత్తలు వంకాయ - టమాట అంటుకట్టి చక్కటి సత్ఫలితాలు సాధించారు. కూరగాయల పంట సాగులో అధిక ఉత్పాదతక పెంపు కోసం ఇంటర్ - స్పెసిఫిక్ గ్రాఫ్టింగ్ ఒక ఉత్తమ సాధనంగా మారిందని తెలిపారు. "బ్రిమాటో కాన్సెఫ్ట్" కింద గ్రాఫ్టింగ్ ద్వారా ఒకే మొక్కలో వంకాయ, టమోటా ఉత్పత్తి చేయడానికి ఒక వినూత్న సాంకేతికతగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
సేద్యం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో...
నగర సేద్యం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో డ్యూయల్ గ్రాఫ్ టెడ్ బ్రిమాటో టెక్నాలజీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టెర్రస్, కాంపౌండ్‌పై నిలువు తోట లేదా కుండీల పెంపకంలో కూరగాయలు పండించడానికి పరిమిత స్థలాలు అందుబాటులో ఉన్న దృష్ట్యా ఈ టెక్నాలజీ సద్వినియోగం చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో జనాభా అవసరాలకు అనుగుణంగా కూరగాయల పంటల సాగులో ఉత్పాదకత పెంచేందుకు ఈ కొత్త ఆవిష్కరణ దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: COTTON PURCHASE: పత్తి కొనుగోళ్లకు సీసీఐ సై.. దసరా తరువాతే ముహూర్తం