తెరాస సర్కారు ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి దిక్సూచిలా నిలుస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. టీఎన్డీవో అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరంజన్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నుంచి ఉన్నత శ్రేణి కార్యదర్శులుగా పదోన్నతులకు 8 మందిని అర్హులుగా గుర్తించి... నలుగురికి ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రతిష్ఠాత్మక రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ దేశానికే ఆదర్శమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
మంత్రిని కలిసిన వారిలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు చిలక నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు నరేందర్, మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ముకురం, అసోసియేట్ అధ్యక్షుడు వెంకటేశం, పదోన్నతులు పొందిన కార్యదర్శులు ఉన్నారు.