పంచాయతీ కార్యదర్శులపై ఇటీవల పెరుగుతున్న పని ఒత్తిడి పట్ల అన్ని జిల్లాల ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఎన్నో పనులతో ఒత్తిడి
పంచాయతీ కార్యదర్శులందరికీ నిర్దిష్టమైన జాబ్ చార్ట్‌ను, పని వేళలను అమలు చేయాలని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కోరారు. ఆన్లైన్ పనితో మానసికంగా ఒత్తిడికి గురి చేయవద్దన్నారు. ఏడాది నుంచి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం మొదలుకొని పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలకమైన స్థానంలో పనిచేస్తోన్న వారిపై అధికారులు తీవ్రమైన ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపించారు.
సౌకర్యాలు కల్పించండి
ఈ చర్యలతో వారికి పని పట్ల విముఖత కలగజేస్తున్నారని వాపోయారు. యాప్‌లను వాడుతూ విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసే అధికారులు... కంప్యూటర్, ట్యాబ్, ఇంటర్నెట్, ఫోన్ లాంటి సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శులకు పనులు చెప్పడమే తప్ప అవసరాలు పట్టించుకోవడం లేదని... వారి సౌకర్యాల కల్పన పట్ల దృష్టి సారించాలని కోరారు.
అదనపు భారం
జాబ్ చార్ట్‌కు అదనంగా ఉపాధి హామీ పథకం బాధ్యతలు తీవ్ర భారంగా మారాయని తెలిపారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నటువంటి ఒక సహాయకుడుని ప్రతి పంచాయతీకి నియమించేలా అధికారులు నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: 'పని చేస్తాం కానీ..అధిక పనిభారం వద్దు'