TNGO and TGO leaders meet kcr : ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే సానుకూల ప్రకటన చేస్తారని టీఎన్జీఓ, టీజీఓ నేతలు తెలిపారు. శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, టీజీఓ అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కలిశారు. ఐదేళ్ల గడువు ముగిసినందున ఉద్యోగులకు వేతన సవరణ ఇవ్వాలని, మధ్యంతర భృతి ప్రకటించాలని సీఎంను కోరారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకం పైనా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల్లో మళ్లీ సమావేశం అవుతానని.. వేతన సవరణ కమిషన్‌తో పాటు మధ్యంతర భృతి ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఆరోగ్య పథకం కూడా ఇప్పటికే పూర్తిగా సిద్దమైందని, సీఎం అప్పుడే నిర్ణయం ప్రకటిస్తారని చెప్పారు. రేపు లేదా ఎల్లుండి వేతన సవరణ కమిషన్, మధ్యంతర భృతిపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేస్తారని నేతలు తెలిపారు.
2021లో వేతనాల పెంపు.. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి అయిదు సంవత్సరాలకొకసారి వేతన సవరణ ఉంటుంది. గతంలో 2018 మే 18వ తేదీన విశ్రాంత ఐఏఎస్ అధికారి సీఆర్ బిస్వాల్ నేతృత్వంలో ఉమామహేశ్వరరావు, మహమ్మద్ అలీ రఫత్‌లతో ఏర్పాటైన పీఆర్సీ కమిషన్.. 2020 డిసెంబర్ 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది.
ఈ నివేదికలో ఉద్యోగుల వేతనసవరణ, పదవీ విరమణ వయస్సు పెంపు సహా ఇతర భత్యాలు, తదితరాలపై కమిషన్ తన సిఫారసులను ప్రభుత్వానికి అందించింది. ఆ సిఫారసుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను మూలవేతనంపై ఏడున్నర శాతం పెంచాలని ప్రతిపాదించింది. దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకతలు వచ్చాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
దీంతో 2021 జూన్ 11 న ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది సహా పెన్షనర్లు మొత్తం 9 లక్షల 21 వేల37 మందికి 30 శాతం ఫిట్మెంట్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీని ప్రకారం ఉద్యోగల కనీస వేతనం రూ.19 వేలకు పెరిగింది. కనీస పింఛను మొత్తాన్ని రూ.6500 నుంచి రూ.9500లకు పెంచగా.. రిటైర్మెంట్ గరిష్ఠ గ్రాట్యుటీని 12 నుంచి 16 లక్షల రూపాయలకు పెరిగింది. పెన్షనర్లు, కుటుంబ సభ్యులకు మెడికల్ అలవెన్స్ నెలకు 350 నుంచి 600 రూపాయలకు పెంచారు. పొరుగుసేవల ఉద్యోగుల వేతనాలు నెలకు రూ.15,600 రూ.19,500, రూ.22,750 గా పెంచారు.
ఇవీ చదవండి :