kodandaram: 'రాష్ట్రంలో నిరుద్యోగం మూడు రెట్లు పెరిగింది' - తెలంగాణ వార్తలు
రాష్ట్రం ప్రభుత్వం సమగ్ర సమాచారంతో కూడిన ఆర్థిక నివేదికను విడుదల చేయలేదని తెజస(tjs) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్(kodandaram) ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగం మూడు రెట్లు పెరిగిందని అన్నారు. ప్రభుత్వం ఇరిగేషన్ పేరుతో కమీషన్ల కోసం దుబార చేస్తోందని విమర్శించారు.
ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక నివేదికపై తెజస(tjs) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్(kodandaram) అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం మూడు రెట్లు పెరిగిందని... రెండేళ్లుగా రాష్ట్ర ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు. సమగ్ర సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. నిర్మాణం, రియల్ ఎస్టేట్ , విద్యా, ఆరోగ్య వ్యవస్థలు సంక్షోభంలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇరిగేషన్ పేరుతో కమీషన్ల కోసం దుబార చేస్తోందన్నారు. ఆదాయం పెరిగితే... రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం ఎందుకు పెరిగిందని కోదండరామ్ ప్రశ్నించారు.
దళారులకే మేలు
వ్యవసాయంలో వచ్చే ఆదాయం రైతులకు అందడం లేదని... దళారులకే లాభం చేకూరుతోందన్నారు. 98 శాతం మంది రైతులు అప్పులబారిన పడ్డారని తెలిపారు. ఆరోగ్య శ్రీ నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథలపై అంచనాలు పెంచి కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఇరిగేషన్‌పై పొదుపు పాటిస్తే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రభుత్వం చాలా అంశాలను దాచేప్రయత్నం చేసిందని... ఆర్థిక నివేదిక అసమగ్రంగా ఉందన్నారు. ఆదాయం ఉంటే నిద్యోగ సమస్య ఎందుకు పెరిగిందో నివేదికలో చెప్పలేదని... కరోనా దెబ్బతో ఇండస్ట్రీయల్, సేవా రంగాలు కుదేలయ్యాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిపై దశలవారీగా ఎండగడుతామని కోదండరామ్ స్పష్టం చేశారు.
ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ఒకవైపు రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేలా ఉంది. మరోవైపు సమగ్ర సమాచారాన్ని ముక్కలు, ముక్కలు చేసి తమకు నచ్చిన సమాచారం పారేసి ఇగజూడు మేమెంత అద్భుతంగా నడుపుతున్నామో చెప్పుకోవడానికి ప్రయత్నం చేసింది. విద్యా రంగంలో భారతదేశంలో అత్యంత వెనకబడిన రాష్ట్రం తెలంగాణ. అక్షరాస్యత శాతాన్ని ఎందుకు పెంపొందించలేకపోతున్నాం. కారణాలు చెప్పాలి.
-కోదండరామ్, తెజస రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చదవండి: Dalitha bandhu: హుజురాబాద్‌లో దళిత బంధుకు మరో రూ.200 కోట్లు