రాష్ట్ర ప్రభుత్వం సైతం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని తెలంగాణ జన సమితి(TJS) అధ్యక్షుడు కోదండరామ్(Kodandaram) ఆరోపించారు. తీవ్రవాదుల ఆచూకీ కోసం ఉపయోగించే పెగాసస్‌ను ప్రజల కోసం పనిచేసే మానవ హక్కుల నేతలు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్ట్‌లపై వాడుతూ గోప్యత హక్కును హరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా సంఘటితమై పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దేశంలో మొత్తం వెయ్యి మంది ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. ఇది హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపారు. మొబైల్‌లోకి ఆ సాఫ్ట్‌వేర్‌ను ఏదోలా ప్రవేశపెట్టి మొత్తం డేటాను తస్కరిస్తున్నారని ఆరోపించారు.
'పెగాసస్ విషయంలో అందరికంటే తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఒక ఆకు ఎక్కువే చదివింది. 2015లోనే మాకు మంత్రులు హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌తో ఫోన్లను ట్యాప్ చేస్తారంటా!, జాగ్రత్తగా ఉండాలని అని మంత్రులు చెప్పేవారు. కొన్ని విషయాల్లో మాకు అనుమానం వస్తుంది. మేం అనుకున్న కార్యక్రమం గురించి ఫోన్లో మాట్లాడుకుంటాం. ఇంకా ప్రకటించకముందే పోలీసులు మా ఇళ్ల ముందు ఉంటారు. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని తెలిసిపోతుంది. మాములు ట్యాపింగ్ కన్నా పెగాసస్ అంటే ప్రభుత్వ లింకును జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్లే లెక్క!.'
-కోదండరామ్, తెజస అధ్యక్షుడు
పెగాసస్ ప్రకంపనలు
భారత్ సహా అనేక దేశాల్లో సంచలనం సృష్టిస్తున్న పెగాసస్ స్పైవేర్ వివాదాన్ని 'భారతదేశ వాటర్ గేట్ కుంభకోణం'గా విపక్షాలు పేర్కొంటున్నాయి. అమెరికాలో రిచర్డ్ నిక్సన్ ప్రభుత్వం 1972-74 మధ్యకాలంలో రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ సంభాషణలను ఆలకించేందుకు గుప్త సాధనాలను వాడారు. ఆ విషయం బహిర్గతం కావడంతో, 1974 ఆగస్టు 8న నిక్సన్ రాజీనామా చేశారు. దీన్ని వాటర్ గేట్ కుంభకోణంగా పేర్కొంటారు. భారత్‌లో బోయింగ్, డసో, సాబ్ వంటి బడా కార్పొరేట్ సంస్థల ఉన్నతాధికారుల ఫోన్ సంభాషణలను ఆలకించడానికి పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించారన్న మీడియా కథనాలు ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అమెరికా, ఐరోపాలకు చెందిన ఈ మూడు సంస్థలు... భారత్‌కు అధునాతన ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి.
ఎలా చేస్తారు?
సాధారణంగా.. అనుమతి లేని యాప్‌లు, గేమింగ్ యాప్స్ నుంచి ఈ తరహా స్పైవేర్లను ఇన్‌స్టాల్ చేస్తుంటారు. అయితే.. పెగాసస్ విషయంలో మాత్రం.. వాట్సాప్‌లోని వాయిస్ కాల్స్‌లో ఉండే సెక్యూరిటీ బగ్‌ల ద్వారా దీన్ని ఫోన్లలో ప్రవేశపెడుతున్నారు. ఒక్కోసారి కేవలం మిస్డ్‌కాల్‌తోనే దీన్ని ఫోన్లలోకి జొప్పిస్తుంటారు. సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత కాల్ లాగ్‌లోకి వెళ్లి మిస్డ్‌కాల్‌ను డిలిట్ చేస్తారు. దీనితో మిస్డ్‌కాల్ వచ్చిన విషయం కూడా యూజర్‌కు తెలియదు.
పార్లమెంటులో దుమారం
పార్లమెంటు ఉభయసభల్లో పెగాసస్ వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలపై చర్చ జరపాలని విపక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. దీంతో ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే మరోరోజు వృథాగా పోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని కోదండరామ్ ఆరోపించారు.
ఇదీ చదవండి: పెగాసస్ వివాదంతో ప్రతిపక్షం సంఘటితం!