రాష్ట్ర సాధనకోసం పోరాటంలో పాల్గొన్న ప్రజా సంఘాలను నిషేధించడం దారుణమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 16 ప్రజా సంఘాలను చట్టవ్యతిరేకమైనవిగా ప్రకటించి, నిషేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించే గొంతులను నొక్కడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పౌరహక్కులు, ప్రజాస్వామ్య ఆకాంక్షల కోసం కృషి చేసిన చరిత్ర గల సంఘాలను నిషేధించడం సరైనది కాదన్నారు. ఇది రాజ్యాంగవిరుద్ధమని ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాథమిక హక్కులైన భావ ప్రకటన స్వేచ్ఛ, సంస్థలను స్థాపించుకునే హక్కులను ఈ నిర్ణయం కాల రాస్తుందన్నారు.
ఈ ఉద్యమాల భావజాలమే రాష్ట్రం సాధనకు తోడ్పడిందని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యమాల సహకారంతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని.. తక్షణమే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కోదండరాం డిమాండ్ చేశారు.