తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాలను మార్పు చేస్తూ తితిదే తీసుకొన్న నిర్ణయం గురువారం నుంచి అమలులోకి వచ్చింది. గతంలో తెల్లవారుజామున 5:30 గంటలకు ప్రారంభమయ్యే బ్రేక్ దర్శనాలు.. ఇప్పుడు 8 గంటలకు ప్రారంభిస్తున్నారు. గతంలో మంగళవారం 6:30 గంటలకు.. శుక్రవారం 8:30 గంటలకు బ్రేక్ దర్శనాలు ప్రారంభించేవారు. శ్రీవారి దర్శనం కోసం రాత్రి నుంచి కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు ఉదయం త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు బ్రేక్ దర్శన సమయాన్ని మార్పు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ప్రయోగాత్మకంగా అమలు చేసిన మొదటి రోజు ఉదయం 6 నుంచి 7:30 గంటల వరకు.. దాదాపు 8 వేల మంది సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు తితిదే ప్రకటించింది. ఈ నిర్ణయంపై బ్రేక్ దర్శనం చేసుకొనే భక్తుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. గతంలో బ్రేక్ దర్శనాల అమలు సమయంతో సర్వదర్శనాలు ఉదయం తొమ్మిది గంటల తర్వాతనే ప్రారంభమయ్యేవి. శుక్రవారం రోజు మరింత ఆలస్యమయ్యేవి. దీంతో ముందు రోజు రాత్రి సర్వదర్శనానికి కంపార్ట్మెంట్లోకి ప్రవేశించిన భక్తులు.. దాదాపు 10 గంటలు పైబడి నిరీక్షించాల్సి వచ్చేది. కొత్త విధానంతో భక్తులు వేచి ఉండాల్సిన సమయం తగ్గుతుందని తితిదే భావిస్తోంది. ప్రయోగాత్మకంగా బ్రేక్ దర్శన సమయాలను మార్చిన తితిదే శ్రీవాణి ట్రస్టుకు విరాళాలిచ్చే భక్తులకు టికెట్ల కేటాయింపు తిరుపతిలో చేపట్టింది. మార్చిన ఈ విధానాలతో తిరుమలలో వసతి గదులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: గ్రూప్ 4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య: కేటీఆర్
రూ.500.. 100కిలోమీటర్లు.. పంపిన నాలుగేళ్లకు చేరిన మనీ ఆర్డర్