తిరుపతికి టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారు.. తిరుమల శ్రీవారిని సులభంగా, శీఘ్రంగా ప్రత్యేక దర్శనం చేసుకోవచ్చని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సులు నడుపుతోందని అన్నారు. ప్రతి రోజు 1,000 మంది ప్రయాణికులకు రూ.300 శీఘ్ర దర్శన టికెట్లు ఇచ్చేందుకు అవకాశం ఉందని ఆయన వివరించారు. దీనిని భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు.
మార్చి 18 వరకు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో వెళ్లిన 1,14,565 మంది ప్రయాణికులకు తిరుమలలో ప్రత్యేక దర్శనం లభించిందని బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ, సాధారణంగా వెళ్లేవారికి దర్శనానికి పట్టే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లాలని పేర్కొన్నారు. తద్వారా శ్రీవారి దర్శనం త్వరగా అవుతుందని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్ ద్వారా రూ.300 టికెట్‌తో దర్శనం చేసుకోవాలంటే నెల రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తోందని చెప్పారు. అదే టీఎస్‌ఆర్టీసీ ద్వారా అయితే వారం రోజులు చాలని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన బస్సుల్ని తిరుపతికి నడిపిస్తున్నట్లు వివరించారు. తిరుమల వెళ్లే భక్తులు.. మరిన్ని వివరాల కోసం టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్ www.tsrtconline.in చూడాలని ఆయన సూచించారు.
భద్రాద్రి రామయ్య తలంబ్రాలు డోర్ డెలివరీ: మరోవైపు శ్రీరామ నవమి సందర్భంగా.. భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. గత సంవత్సరం మాదిరిగానే.. ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాముల వారి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు ఆర్టీసీ సన్నద్దమవుతోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు.. టీఎస్‌ఆర్టీసీ కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపింది. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 9154680020లలో సంప్రదించాలని పేర్కొంది. తమ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారని యాజమాన్యం వివరించింది.
గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రజలు, పర్యాటకులకు.. టీఎస్ఆర్టీసీ మరింత చేరువ అయ్యేందుకు రెండు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఇప్పటికే టీ-24 టికెట్‌ను సంస్థ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా టీ-6, ఫ్యామిలీ-24 పేరుతో కొత్త టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు విద్యార్థినులకు పూర్తి రక్షణ కల్పించాలన్న రాష్ట్ర ప్రభుత్వ యోచన మేరకు.. ఉన్నత విద్యామండలి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థినులకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం గమ్యస్థానానికి తీసుకెళ్లడం.. సాయంత్రం తిరిగి వారి ప్రదేశాలకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ట్రిప్పులు నడపడానికి సన్నాహాలు చేస్తోంది.
ఇవీ చదవండి: విద్యార్థినులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ జూన్ నుంచి ప్రత్యేక బస్సులు
TSRTC గుడ్ న్యూస్ భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలు డోర్ డెలివరీ