కరోనా ప్రభావంతో తితిదే భారీగా ఆదాయం కోల్పోతోంది. కొవిడ్ కారణంగా ఈ సంవత్సరం మార్చి 20 నుంచి జూన్ 8 వరకు శ్రీవారి భక్తుల దర్శనాలను రద్దు చేసింది. అనంతరం ప్రయోగాత్మకంగా రోజుకు మూడు వేల చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను అందుబాటులోకి తెచ్చింది. క్రమక్రమంగా ఆ సంఖ్యను పెంచుకుంటూ 9వేల వరకు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచుతోంది. కరోనా భయంతో గతంలోనే టికెట్లు కొనుగోలు చేసిన భక్తుల్లో సగం మందే శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. పెరుగుతున్న కొవిడ్ కేసులు, తిరుపతిలో లాక్‌డౌన్ అమలుతో భక్తుల రాకపోకలు తగ్గాయి. దాంతో స్వామివారికి సమకూరే ఆదాయం భారీగా తగ్గుతోంది.
అన్నింటా అదే పరిస్థితి
సాధారణ రోజుల్లో రోజుకు రూ.3 కోట్లు హుండీ ఆదాయం వచ్చేది .. ప్రస్తుతం రూ.50 నుంచి రూ.60 లక్షలు వస్తోంది. గతంలో నిత్యం దాదాపు 3లక్షల లడ్డూలు విక్రయమయ్యేవి.. ఇప్పుడు అందులో పదో వంతు అమ్మకాలే సాగుతున్నాయి. తలనీలాల ఆదాయానిదీ అదే పరిస్థితి. తితిదేకు సంబంధించి దాదాపు 12వేల కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, టన్నుల కొద్దీ ఉన్న బంగారం నుంచి వచ్చే వడ్డీ ఆదాయంతో ప్రస్తుతం సర్దుకుంటోంది. ఇప్పటికిప్పుడే ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా.. కొవిడ్ ఉద్ధృతి మరికొన్ని నెలలపాటు కొనసాగితే కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తవచ్చనే అభిప్రాయం ఉంది. కరోనా ప్రభావం పూర్తిగా తొలగితే తిరిగి ఆర్థికంగా పుంజుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'