Tight Security in Hyderabad ahead of Hanuman Jayanti Procession : శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా భాగ్యనగరంలో నిర్వహించే శోభాయాత్రకు పోలీసు శాఖ పూర్తి భద్రత కల్పిస్తుందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ప్రతి సంవత్సరం నిర్వహించే హిందూశక్తి ప్రదర్శన, వీర హనుమాన్ విజయయాత్ర సందర్భంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ నాయకులతో సమావేశమైన ఆయన.. నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. యాత్రలు ప్రశాంతంగా సాగేందుకు.. అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పండుగలు అంటేనే ఐక్యతకు నిదర్శమని ఆయన వివరించారు.
రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు : శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా జంట నగరాల్లో గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయిని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో పలు దారులలో వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. కొన్ని మార్గాలలో వాహనాలను దారి మళ్లించి, ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లేలా పోలీసులు ఏర్పాట్లు చేశారు. గోషామహల్, సుల్తాన్ బజార్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఆంక్షలు ఉంటాయిని తెలియజేశారు.
యాత్ర సాగనున్న రూట్ మ్యాప్ ఇదే : దాదాపు 6 కిలోమీటర్ల మేర సాగే శోభాయాత్ర సీతారాంబాగ్ ఆలయం వద్ద ప్రారంభమై బోయగూడ కమాన్, మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, దూల్‌పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్‌బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సాగి చివరికి సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలకు శోభాయాత్ర చేరుకుంటుందని పోలీసు అధికారులు తెలిపారు.
బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రపన్నారంటూ లేఖ : మరోవైపు శ్రీరామనవమి సందర్బంగా నగరంలో జరిగే ఊరేగింపు సమయంలో.. బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్రపన్నారంటూ మంగళవారం రాత్రి సోషల్ మీడియాలో ఒక లేఖ కలకలం సృష్టించింది. ఈనెల 31న నగరంలోని పలు ప్రాంతాల్లో దేవాలయాలు, పార్టీ కార్యాలయాలు, ప్రజాప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడికి కుట్రపన్నుతున్నారని లేఖలో పేర్కొన్నారు. మండిమీరాలం ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వరి అనే మహిళ... పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఉన్న లేఖ.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అప్రమత్తమైన పోలీసులు విచారణ జరిపి... ఆ లేఖ నకిలీదని నిర్ధారించారు. దిల్లీకి చెందిన ఒక మహిళ తమ బంధువులపై కోపంతో.. అసత్యప్రచారానికి పాల్పడినట్టు పోలీసులు ధ్రువీకరించారు.
ఇవీ చదవండి: