Bidding Process Of Hyderabad-Vijayawada Highway : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో మొత్తం 17 ప్రమాదకర ప్రాంతాలను బాగుచేసేందుకు ఎట్టకేలకు గుత్తేదారులు ముందుకొచ్చారు. ఐదు నెలలుగా సాగుతున్న టెండర్లు వాయిదా పర్వం ఎట్టకేలకు తేలిపోయింది. సమస్య ఒక కొలిక్కి వచ్చింది. గత సంవత్సరం డిసెంబరులో టెండర్లను ఆహ్వానిస్తే తాజాగా మూడు గుత్తేదారు సంస్థలు ముందుకొచ్చాయని సమాచారం.
రూ.333 కోట్లతో నిర్మాణం : ఆర్థిక, సాంకేతిక బిడ్స్‌ను పరిశీలించిన తర్వాత వచ్చే వారంలో కాంట్రాక్టును పట్టడానికి గుత్తేదారును ఖరారు చేయనున్నట్లు ఒక ఉన్నతాధికారి ఈనాడు, ఈటీవి భారత్‌కు చెప్పారు. ఈ నెల చివరిలో కాంట్రాక్టుకు సంబంధించిన ఒప్పంద ప్రక్రియ పూర్తయిన తర్వాత సంబంధిత గుత్తేదారు పనులు చేపడతారని తెలిపారు. 17 ప్రమాదకర ప్రాంతాలను రూ.333 కోట్లతో ఆయా ప్రాంతాలను ప్రమాదరహితంగా చేసేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లను ఆహ్వానించింది. హైదరాబాద్- విజయవాడ రహదారి నిర్మాణ సమయంలో నాలుగు వరుసలుగా ఉన్న ఈ రహదారిని 2025 నాటికి ఆరు వరుసలకు విస్తరించాలని నిర్ణయించారు.
ప్రమాదకర ప్రాంతాలను చక్కదిద్దుతాం : ఏపీ విభజన తర్వాత నుంచి ఈ మార్గంలో రాకపోకలు తగ్గడం వల్ల టోల్ వసూలు వ్యవహారంలో జాతీయ రహదారుల సంస్థకు, రహదారి నిర్మాణ సంస్థకు మధ్య వివాదం తలెత్తింది. ఈ మార్గాన్ని నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలకు విస్తరించాలా? వద్దా? అన్న విషయంపై నాలుగైదు సంవత్సరాలుగా మీమాంస కొనసాగుతోంది. ఇంతకుముందుతో పోలిస్తే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గినందువల్ల రహదారిని ఆరు వరుసలకు విస్తరించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. అలాగే ఈ రహదారిలో ప్రమాదకర ప్రాంతాలను చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
పెరిగిన వ్యయం : కేంద్రం మొదట్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను చక్కదిద్దేందుకు రూ. 265 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించింది. దాని తర్వాత అవసరమైన చోట్ల బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయించటం వల్ల వీటి నిర్మాణ వ్యయం రూ.333 కోట్లకు పెరిగినట్లు సమాచారం.
ప్రమాదకర ప్రాంతాలివే : చిట్యాల బైపాస్‌రోడ్డు, పెదకాపర్తి, కట్టంగూర్, కొర్లపహాడ్, నల్గొండ క్రాస్‌రోడ్డు, సూర్యాపేట సమీపంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల, సూర్యాపేట శివారున, జనగామ క్రాస్‌రోడ్డు, దురాజ్‌పల్లి క్రాస్‌రోడ్, దురాజ్‌పల్లి క్రాస్‌రోడ్, కోమరబండ క్రాస్‌రోడ్, ఆకుపాముల బైపాస్‌రోడ్, కటకమ్మగూడెం క్రాస్‌రోడ్, శ్రీరాంపురం, మేళ్లచెరువు క్రాస్‌రోడ్, నవాబ్‌పేట, రామాపురం క్రాస్‌రోడ్ వీటిని ప్రమాదకర ప్రాంతాలుగా గుర్తించారు. గుత్తేదారుతో ఒప్పందం చేసుకున్న నాటి నుంచి ఏడాదిన్నరలో పనులు చేసేందుకు వీలుగా టెండర్లు ఆహ్వానించారు. పది సంవత్సరాల వరకు ఆయా ప్రాంతాల నిర్వహణ బాధ్యత కూడా గుత్తేదారుదే.
ఇవీ చదవండి:
Robbers: హైదరాబాద్-విజయవాడ హైవేపై కత్తులతో దోపిడీ ముఠా హల్చల్!
దశాబ్ధమైనా దారికి రాలే.. యాక్సిడెంట్ జోన్‌గా హైదరాబాద్- విజయవాడ హైవే