ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 20, 21 తేదీల్లో ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది.
ఈ రోజు ఉపరితల ద్రోణి తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించినట్లు అధికారులు తెలిపారు. సగటున సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల నుంచి 1.5 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు. నిన్న తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు వాయువ్య పరిసర పశ్చిమ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 నుంచి 5.8 కిలో మీటర్ల వరకు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఎత్తుకు వెళ్లే కొలదీ నైరుతి దిశ వైపుకు తిరిగి ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆవర్తనం రాగల 12 గంటల్లో ఒడిశా తీరం దగ్గరకు చేరుకునే అవకాశమున్నట్లు వాతావరణ అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: Ganesh immersion: గణేశ్ నిమజ్జనం సందర్భంగా భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు