కరోనా మహమ్మారి రెండోదశ రాష్ట్రంలో రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతోంది. రెండ్రోజులుగా నిత్యం లక్షకు పైగా పరీక్షలను వైద్యారోగ్యశాఖ చేస్తోంది. కొత్తగా 1,11,726 పరీక్షల ఫలితాలు వెలువడగా 2,909మందికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపింది. ఆ కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,24,091కి పెరిగింది. వైరస్ బారినపడి మరో ఆరుగురు చనిపోగా ఇప్పటివరకు వ్యాధికి బలైనవారిసంఖ్య 1,752కు చేరింది. మరో 584మంది కోలుకోగా ఇప్పటివరకు కొవిడ్‌ను జయించిన వారి సంఖ్య 3,04,548కి చేరింది. 17,791యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ వివరించింది.
నిండుకున్న పడకలు
జీహెచ్ఎంసీ పరిధిలో 487మందికి వైరస్ సోకింది. ఎనిమిది జిల్లాల్లో వందకు పైగా కేసులు నమోదు కాగా మరో మూడు జిల్లాల్లో వందకు చేరువగా ఉన్నాయి. ఇప్పటికే నిజామాబాద్‌లో ప్రైవేటు ఆసుపత్రుల్లో దాదాపు 95శాతం పడకలు నిండుకోగా ప్రభుత్వాసుపత్రుల్లోనూ దాదాపు 80శాతానికి పైగా పడకలు నిండిపోయాయి. పరిస్థితి తీవ్రత ఇలాగే కొనసాగితే మూడు రోజుల్లోనే నిజామాబాద్‌లో పడకల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.
ప్రైవేటులో చికిత్స
కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ భవంతులను కొవిడ్ కేర్ సెంటర్లుగా మార్చి పడకలను పెంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే 33 జిల్లాల్లో 46 కరోనా కేంద్రాలను ఏర్పాటు చేసిన సర్కారు అదనంగా 4,298పడకలు అందుబాటులోకి తీసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లాలో 135 పడకలను అందుబాటులోకి తేగా కేవలం ఏడుగురే ఐసోలేషన్‌లో ఉన్నారు. హైదరాబాద్ నేచర్ క్యూర్ ఆస్పత్రిలో 280 సిద్ధం చేయగా అక్కడ 70 మంది చికిత్స పొందుతున్నారు. ఆయుర్వేద ఆస్పత్రిలో 220 పడకలకుగాను మొత్తం ఖాళీగా ఉన్నట్టు అధికారులు వివరించారు. నిజామియా టీబీ ఆసుపత్రిలో 225 పడకలను కేటాయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్, సాధారణ పడకలు కలిపి 8,596 పడకలను కొవిడ్ రోగులకు కేటాయించగా అందులో 6,840 ఖాళీగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రైవేటులోనూ 7,592 పడకలు ఖాళీగా ఉన్నాయి.
వ్యాక్సినేషన్ వేగవంతం
వైరస్ కట్టడిలో భాగంగా మైక్రో కంటైన్మెంట్ జోన్లను సిద్ధం చేస్తున్న సర్కారు వ్యాక్సినేషన్ సైతం వేగవంతం చేసింది. అర్హులైన వారంతా వ్యాక్సిన్ తీసుకుని మహమ్మారి నుంచి ఉపశమనం పొందాలని వైద్యారోగ్య శాఖ సూచించింది.
- ఇదీ చూడండి: రాష్ట్రంలో కరోనా పంజా.. ఒకేరోజు 2909 కేసులు