భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ జారీ చేస్తున్న ఆధార్ కార్డుల విషయంలో.. ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బంది కొందరు తమ చేతివాటం ప్రదర్శిస్తూ అక్రమాలకు తెరలేపుతున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పరిస్థితి అధికంగా ఉన్నట్లు యుఐడీఏఐ అధికారులు గుర్తించారు.
తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మించి అవకతవకలు
- ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు ఏకంగా 250కిపైగా ఎన్‌రోల్‌మెంటు కేంద్రాలపై శాఖాపరమైన చర్యలు అధికారులు తీసుకున్నారు. అపరాధ రుసుం కింద ఇప్పటి వరకు ఏపీలో రూ.1.5 కోట్లుకుపైగా మొత్తం వసూలు చేశారు. ఆధార్ కార్డుల జారీకి అవసరమైన ధ్రువీకరణ పత్రాల పరిశీలనలో నిర్లక్ష్యం వహించిన మరో 15 మీసేవా ఆధార్ ఎన్‌రోల్‌మెంటు కేంద్రాలకు తాజాగా నోటీసులు జారీ చేశారు.
- హైదరాబాద్‌లో ఇటీవల తప్పుడు పత్రాలతో ఆధార్ పొందారని అభియోగాలను ఎదుర్కొంటున్న 127 మంది ఆధాార్‌కార్డు దారుల విచారణ మే నెలకు వాయిదా పడింది. ప్రాథమిక విచారణ తర్వాత యుఐడీఏఐకి పోలీసులు అందించిన వివరాల ఆధారంగా వీరికి నోటీసులు జారీ అయ్యాయి.
ధ్రువీకరణ పత్రాలు లేకపోతే..?
పుట్టిన తేదీ, చిరునామాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు లేకపోతే.... గెజిటెడ్ అధికారులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలకే ఆధార్ కార్డుల జారీకి అనుమతిస్తారు. అలా పొందేందుకు 1989కి ముందు పుట్టిన వారే అర్హులు. 1989 తరువాత పుట్టిన వారికి చెంది ప్రభుత్వం జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలను మాత్రమే జతపరచాల్సి ఉంటుందని యుఐడీఏఐ అధికారులు స్పష్టం చేశారు.
సిబ్బంది ఇష్టారాజ్యం
కానీ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కేంద్రాల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆధార్ కార్డు కోసం వచ్చిన వారికి చెందిన చిరునామా, పుట్టిన తేదీలకు చెందిన పత్రాలకు సంబంధించిన జీరాక్స్ కాపీలతోపాటు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను పరిశీలన చేస్తారు. అవన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధరించుకున్న తరువాతనే.. వాటిని యుఐడీఏఐ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేస్తారు. ఇలాంటి పరిశీలన సక్రమంగా జరగడం లేదని ఉన్నతాధికారుల పరిశీలనలో వెల్లడైంది.
జనన ధ్రువీకరణ పత్రానికి రూ. 300లు
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ఎన్‌రోల్‌మెంటు కేంద్రాల్లో అప్‌లోడ్ చేసిన పుట్టిన తేదీల ధ్రువీకరణ పత్రాలను పరిశీలన చేయగా ఒకే వైద్యుడు వాటిని జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు. వాస్తవ పరిస్థితిపై ఆరా తీసిన యుఐడీఏఐ అధికారులు ఒక్కో జనన ధ్రువీకరణ పత్రానికి 300రూపాయలు తీసుకుని ఇచ్చాడని తేల్చారు.
క్షేత్రస్థాయిలో వెలుగుచూస్తున్న లోపాలు
యాభైకిపైగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన ఆ వైద్యుడిని బాధ్యుడిని చేయాలంటూ జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఎన్‌రోల్‌మెంటు కేంద్రాల స్థాయిలో జరుగుతున్న తప్పిదాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్న యుఐడీఏఐ అధికారులు.. శాఖాపరమైన చర్యలతో నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చూడండి: విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి