Behaviours You Should Never Accept in Marriage : ఏ వ్యక్తి జీవితంలోనైనా అత్యంత కీలకఘట్టం.. "పెళ్లి(Marriage)". అప్పటివరకు ఒకలా ఉండే లైఫ్.. పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోతుంది. బాధ్యతలు, బంధాలు పెరుగుతాయి. కష్టనష్టాలు, సుఖదుఃఖాలను ఒకరికొకరు పంచుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. కానీ.. ఈ రోజుల్లో "ఫ్రీడమ్" పేరుతో చాలా మంది చిన్న చిన్న విభేదాలనే భూతద్ధంలో చూస్తూ ఏకంగా మూడు ముళ్లు తెంచుకునే వరకూ వెళ్తున్నారు. ఆ పరిస్థితి రాకుండా.. కొన్ని ప్రాథమిక నియమాలను భార్యాభర్తలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శారీరక హింస : వివాహ బంధంలో శారీరక హింస చాలా తీవ్రమైన సమస్య. మీ దాంపత్య జీవితంలో కొట్టడం లాంటి శారీరకంగా వేధించే పనులు చేయకండి. దీనివల్ల ఇద్దరి మధ్యా సన్నిహిత సంబంధం లేకుండా పోతుంది. ప్రేమ స్థానంలో కోపం, భయం, అసహనం మొలకెత్తుతుంది. ఇవి ఎంత పెరిగితే బంధానికి అంత విఘాతం కలుగుతుంది. అందువల్ల.. సమస్య ఏదివచ్చినా.. మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోండి.
మానసిక హింస : ఇది అతిపెద్ద హింస. కంటికి కనిపించకుండా మనసును తినేస్తుంది. ఈ ప్రవర్తన భార్య లేదా భర్త మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మీ దాంపత్య బంధంలో.. ఇలాంటి హింసకు ఏ మాత్రం తావ్వివకుండా చూసుకోండి. ఏం జరిగిందో ఇద్దరూ నిజాయితీగా మాట్లాడుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు చూడాలి.
అవిశ్వాసం : అసలు పెళ్లి బంధం నిలపడేదే విశ్వాసం మీద. అలాంటి బంధంలో నమ్మకం లేకుండా ముందుకు సాగడం అసాధ్యం. అంతేకాదు.. దీర్ఘకాలంలో ఇది ప్రమాదకరం కూడా. కాబట్టి మీ భాగస్వామికి మీపైన నమ్మకం కోల్పోయేలా అస్సలు ప్రవర్తించకండి. నిజాయితీగా వ్యవహరించండి. నమ్మకం దెబ్బతింటే బంధానికీ బీటలు వారడం గ్యారెంటీ.
వ్యసనం : మత్తు పదార్థాలు, జూదం లేదా మరేదైనా ఇతర వ్యసనాలు.. ఇవి బానిసైన వ్యక్తిగత జీవితాన్నై కాదు.. కుటుంబాన్ని కూడా ఇబ్బందుల పాలుచేస్తాయి. ఇలా వ్యసనాలకు బానిసయ్యే వారు భాగస్వామిపై శ్రద్ధ చూపలేకపోవచ్చు. ఇది కూడా వివాహ బంధాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రవర్తనకు మీ వివాహం బంధంలో అవకాశం ఇవ్వకండి.
పెళ్లికి ముందు - పార్ట్నర్తో ఈ పనులు చేయొద్దు!
నిర్లక్ష్యం : దంపతుల మధ్య నిండైన ప్రేమ ఉండాలి. ఒకరి కోసం మరొకరు జీవిస్తున్నట్టుగా ఉండాలి. అలా కాకుండా.. మరొకరిని పట్టించుకోకుండా ఉండడం.. వారి ఇష్టాఇష్టాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీపై వారికి ప్రేమ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తమను పట్టించుకోవట్లేదని వేదనకు గురవుతారు. ఇది దీర్ఘకాలం కొనసాగితే.. ఆలోచనలు విడాకుల వైపు మళ్లే ఛాన్స్ ఉంది.
అగౌరవం : ఇద్దరి మధ్యా గౌరవం అనేది చాలా కీలకం. మీ భాగస్వామి అభిప్రాయాలకు కచ్చితంగా విలువనివ్వాలి. అందులో ఏవైనా పొరపాట్లు ఉంటే.. అర్థమయ్యేలా చెప్పాలి. అంతే తప్ప.. వారి అభిప్రాయాలకు, భావాలకు అసలు విలువే లేదన్నట్టుగా ప్రవర్తిస్తే.. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు దెబ్బతింటాయి. అది కూడా మీ బంధాన్ని బీటలు వారుస్తుంది.
కాబట్టి ఇలాంటి ప్రవర్తనకు.. మీ బంధంలో చోటుచేసుకోకుండా చూసుకోండి. ఒకవేళ ఎప్పుడైనా పొడచూపితే.. అవి రిపీట్ కాకుండా చూసుకోండి. చివరగా.. సమస్య ఏదైనా మూడో మనిషి ప్రమేయం లేకుండా.. భార్యాభర్తలు ఇద్దరే మాట్లాడుకొని పరిష్కరించుకోవడం గొప్ప విషయం. ఇదే అన్ని సమస్యలనూ నివారిస్తుంది.
పెళ్లి చేసుకుంటున్నారా? వెడ్డింగ్ ఇన్సూరెన్స్ మస్ట్ - ఎందుకంటే?
పెళ్లి తర్వాత బరువు పెరిగారా? - ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ ఫిగర్ పక్కా!