కరోనా ప్రభావంతో నగరంలో చాలా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలు, షోరూంలు థర్మో స్క్రీనింగ్ తప్పనిసరి చేశాయి. శరీర ఉష్ణోగ్రతలు నమోదు చేసుకున్నాకే.. లోపలకు పంపుతున్నారు. ఏ మాత్రం ఉష్ణోగ్రతల్లో తేడా ఉన్నా.. అటు నుంచి అటే ఇంటికి.. లేదంటే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో థర్మో స్క్రీనింగ్ చాలా అవసరం. ఇందులో రెండో అభిప్రాయానికి తావు లేదు. దీన్నే అన్ని చోట్ల ప్రమాణికంగా భావిస్తున్నారు.
స్క్రీనింగ్ చేయడంలో తేడాతోపాటు పరికరంలో సాంకేతిక సమస్యలుంటే.. కొన్నిసార్లు శరీర ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుదలకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఎండలో నుంచి వచ్చిన సమయంలో స్క్రీనింగ్ చేస్తే.. ఎక్కువ స్థాయిలో శరీర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాసేపు అక్కడే నిరీక్షించిన తర్వాత మళ్లీ తక్కువగా నమోదు అవుతున్నాయి.
ఎంత ఉండాలంటే...?
సాధారణంగా వ్యక్తి శరీర సగటు ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారన్‌హీట్(37 డిగ్రీల సెల్సియస్). అయితే ప్రతి వ్యక్తిలో 97 డిగ్రీల ఫారన్‌హీట్ నుంచి 99 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు మారుతూ ఉంటుంది. దీనిని కూడా సాధారణంగా భావిస్తారు. దీనికి బదులు శరీర ఉష్ణోగ్రత 100.4 డిగ్రీల ఫారన్‌హీట్(38డిగ్రీల సెల్సియస్) కంటే ఎక్కువ దాటితే ఇన్‌ఫెక్షన్ లేదా అనారోగ్యంతో జ్వరం వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.
స్క్రీనింగ్ చేసే సమయంలో పరికరం నుంచి వెలువడే ఇన్‌ఫ్రారెడ్ కిరణాల ద్వారా సదరు వ్యక్తి ఉష్ణోగ్రతను పసిగడుతుంది. సాధారణంగా స్కానింగ్ చేసే సమయంలో సంబంధిత వ్యక్తికి 1-3 సెంటీమీటర్ల దూరం పాటించాలి. అంతకు మించి మధ్యలో ఎక్కువ గ్యాపు ఉంటే గాలిలో ఉన్న వేడి కూడా పరికరంపై ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి సమయంలో శరీర ఉష్ణోగ్రత మారిపోతుంది. దీంతో ఎక్కువ లేదా తక్కువ చూపించే అవకాశం ఉంది. సక్రమంగా స్కానింగ్ చేయక పోవడం కూడా కొన్నిసార్లు శరీర ఉష్ణోగ్రతల్లో తేడా రావడటానికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. నిబంధనలు ప్రకారం స్క్రీనింగ్ చేస్తే కచ్చితమైన లెక్కలు ఉంటాయన్నారు.
ప్రస్తుతమీ పరీక్ష అవసరమే..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితిలో థర్మోస్క్రీనింగ్ చాలా అవసరం. ఇందుకు నిర్ణీత దూరం పాటించాలి. అలాగే నుదురు వద్ద పరికరం పెట్టి స్క్రీనింగ్ చేస్తారు. ఎండ నుంచి వచ్చినప్పుడు శరీరం, తల భాగం కొంత వేడిగా ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు పెరగవచ్చు. స్క్రీనింగ్‌లో జ్వరం లేదని తేలినంతం మాత్రాన కరోనా సోకలేదని చెప్పలేం. చాలామందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్ బయట పడుతోంది. అందుకే కచ్చితంగా ప్రతి ఒక్కరూ జాగ్త్రతలు పాటించాలి. ఇప్పుడే గుంపుల్లోకి వెళ్లక పోవడం చాలా ముఖ్యం.
-డాక్టర్ శివరాజ్, సీనియర్ ఫిజీషియన్