The TSRTC MD has given instructions: వేసవిలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశించారు. బస్టాండుల్లో తాగునీరు సదుపాయంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫ్యాన్లు, కూలర్లు, బెంచీలను ఏర్పాటు చేయాలన్నారు. వేసవిలో ప్రయాణికులకు ఏర్పాట్లు, సంస్థలోని ఇతర అంశాలపై హైదరాబాద్‌లోని బస్‌భవన్ నుంచి ఆర్ఎంలు, డీఎంలు, ఉన్నతాధికారులతో ఎండీ సజ్జనార్ ఆన్లైన్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
అధికారులకు దిశానిర్ధేశం: ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే ప్రధాన విధి అనే విషయం మర్చిపోవద్దన్నారు. ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా పని చేయాలని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి బస్ స్టాండ్‌లో చల్లని నీరు సదుపాయం ఏర్పాటు చేయాలని అన్నారు.
మార్చిలో పెళ్లిళ్లు ఎక్కువ రద్దీ లేకుండా చూడాలి: సాంకేతికతను ఉపయోగించుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. వేసవి సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీ ఉండవచ్చని చెప్పారు. దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వివరించారు. మార్చి నెలలో పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా ఉండడంతో రద్దీకి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైతే అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించారు.
10శాతం ఇస్తున్న రాయితీ అందరికీ తెలిసేలా చెయ్యాలి: శుభకార్యలకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పిస్తున్న విషయాన్ని ప్రయాణికులకు వివరించాలన్నారు. ముందస్తు రిజర్వేషన్‌కు రాయితీ కల్పిస్తున్న విషయాన్ని తెలియజేయాలన్నారు. ప్రయాణికులకు సంస్థ కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. అద్దె బస్సు అవసరమైన వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని చెప్పారు.
ఇవీ చదవండి: