పరిసరాల పరిశుభ్రత వల్ల దోమల బెడద తగ్గి డెంగ్యూ, చికెన్ గున్యా, కలరా లాంటివి రాకుండా ఉంటాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు... ఆదివారం ఉదయం 10 గంటల నుంచి పది నిమిషాల పాటు మీ కోసం కార్యక్రమంలో మంత్రి సతీసమేతంగా పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి తన సతీమణి కల్పన రెడ్డితో కలిసి వారి నివాస పరిసరాలను శుభ్రం చేశారు.
పది నిమిషాల పాటు విధిగా ఇంట్లో, పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని ఖాళీ చేయాలని మేడ్చల్ జిల్లా ప్రజా ప్రతినిధులకు, నాయకులను మల్లారెడ్డి కోరారు. ఎయిర్ కూలర్లలో నిల్వ ఉన్న నీటిని తొలగించి తిరిగి నీటిని నింపాలన్నారు. రిఫ్రిజిరేటర్ యొక్క డ్రాప్ పాన్ తీసి అందులో ఉన్న నీటిని ఖాళీ చేయాలని చెప్పారు. గృహ పరిసరాల్లో పగిలిన కుండలు, డబ్బాలు, డ్రమ్ములు వంటి వాటిలో నీరు నిలిచి ఉంటే తొలగించాలని పేర్కొన్నారు. పిచ్చిమొక్కలు, గడ్డి లాంటివి లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈరోజు నుంచే ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలని మంత్రి తెలిపారు.
ఇవీ చూడండి: అమ్మా.. నీ మనసు వెన్న..