పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై... సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈమేరకు ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టేసింది.
ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతున్న దశలో... తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. న్యాయస్థానంలో రేపు విచారణ ఉండగా... సుప్రీంకోర్టును ఆశ్రయించడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే నిర్ణీత గడువులోపు విచారణ ముగించేలా హైకోర్టుకు సూచించాలని ఏపీ ప్రభుత్వం కోరగా... అందుకు సుప్రీం నిరాకరించింది. ఫలానా గడువులోపు విచారణ ముగించాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. అయితే హైకోర్టు ఈ కేసును త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్లు అభిప్రాయపడింది.