పోడు భూముల సమస్య పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో అటవీభూములు ఎంతమేరకు ఆక్రమణకు గురయ్యాయన్న విషయమై ఆ శాఖ అంచనాలు రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా 7.37 లక్షల ఎకరాల అటవీభూమి ఆక్రమణకు గురైనట్లు అటవీశాఖ ఓ అంచనాకు వచ్చింది. రెండువారాల కిందట పోడు భూముల విషయంపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో అటవీభూముల ఆక్రమణల లెక్కల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగారు. ఈ వివరాలను 23న జరిగే సమావేశంలో సీఎంకు అందించనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆదేశాలతో పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీభూముల సంరక్షణకు కార్యాచరణలో భాగంగా 20నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. 22 వరకు మొత్తం 13 జిల్లాల్లో కలెక్టర్లు, ఇతర అధికారులతో సమావేశాలు జరుగుతున్నాయి.
14 జిల్లాల్లో భారీ ఆక్రమణలు...
రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమణకు గురైన అటవీ భూమి వివరాలను డీఎఫ్‌ఓలు అరణ్యభవన్‌లోని ప్రధాన కార్యాలయానికి పంపించారు. 14 జిల్లాల్లో 10 వేల ఎకరాలకు పైగా ఆక్రమణలున్నట్లు గుర్తించారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అర్బన్, జనగామ జిల్లాల్లో ఒక్క ఎకరం కూడా ఆక్రమణకు గురికాలేదని.. తర్వాత అత్యల్పంగా గద్వాల జిల్లాలో 12 ఎకరాలు, మేడ్చల్‌లో 108.71 ఎకరాల ఆక్రమణలో ఉన్నట్లు తేల్చారు. ఇప్పటివరకు 5.87 లక్షల ఎకరాల ఆక్రమణల వివరాల్ని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ భూమిలో 1,09,584.76 ఎకరాలకు రెవెన్యూ శాఖ లావణి పట్టాలిచ్చినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. 7.37 లక్షల భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది పరిశీలన ఆధారంగా రూపొందించినవని, క్షేత్రస్థాయిలో సర్వే చేపడితే ఆక్రమిత భూమి తగ్గవచ్చని, లేదా పెరగవచ్చని అధికారులు పేర్కొన్నారు. లక్షల ఎకరాల పోడుసమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో కొన్నిచోట్ల తాజాగా ఆక్రమణలు మొదలైనట్లు చెబుతున్నారు.
ఇదీ చదవండి: Huzurabad by election: రంగంలోకి సీఎం కేసీఆర్.. రెండు రోజుల పాటు రోడ్‌షోలు..!