రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి.. ప్రభుత్వం గుర్తించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 లక్షలకు పైగా వృద్దులు, దీర్ఘకాలిక వ్యాధుల బాధితులున్నట్లు...ప్రభుత్వం గుర్తించింది. తొలి రోజు ప్రైవేట్‌లో 45 కేంద్రాల్లో ప్రభుత్వ విభాగంలో 48 చోట్ల వాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు.
మరింత విస్తృతం
రెండో దశ టీకా కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి ప్రత్యేక వార్డులో టీకా వేసుకున్నారు. రెండో దశ తొలిటీకా తీసుకున్న ఆయన... అర్హులైన ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్‌లో నమోదుచేసుకొని వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా రెండోదశ వ్యాప్తి లేదని మంత్రి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో వ్యాక్సిన్ కేంద్రాలను మరింత విస్తృతం చేస్తామని ఈటల పేర్కొన్నారు.
తరలివచ్చిన వృద్ధులు
హైదరాబాద్ సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ టీకా వేయించుకున్నారు. అర్హులైన వారు టీకాలు తీసుకునేందుకు ఆయా కేంద్రాలకు ఉత్సాహంగా తరలివచ్చారు. 60 ఏళ్లు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులున్న రెండు విభాగాల్లో 50 లక్షల మంది ఉంటారని అధికారులు అంచనా. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే తొలివారం అనుమతి ఇస్తున్నారు. మొబైల్, ఆధార్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పూర్తిగా ఉచితంగా టీకా వేస్తున్నారు. హైదరాబాద్ ఫీవర్ , ఉస్మానియా, మలక్‌పేట ప్రాంతీయ ఆస్పత్రి వద్ద పెద్ద సంఖ్యలో వృద్ధులు తరలివచ్చారు.
కట్టడికి దివ్యౌషధం..
మెదక్ జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను... జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. తొలిడోసు తీసుకున్న 28 రోజుల తర్వాత ఇంకొకటి తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి టీకా తీసుకునేందుకు వృద్ధులు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ నారాయణరెడ్డి.. ఆయన మాతృమూర్తికి.. కొవిడ్ వ్యాక్సిన్ వేయించారు. ఇన్నాళ్లు కొవిడ్ తో పోరాడిన తాము... టీకా తీసుకోవటం సంతోషంగా ఉందని.. పలువురు పేర్కొన్నారు. వరంగల్ పట్టణ జిల్లాలో మూడు ఆస్పత్రుల్లో కొవిడ్ టీకా అందిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు వెల్లడించారు. ముందుగా కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే అవకాశం కల్పిస్తామని వివరించారు.