Hyderabad Population 2023: అభివృద్ధిలో దూసుకెళ్తున్న మన హైదరాబాద్ నగరం.. జనాభాలోనూ తగ్గేదే లే అంటోంది. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని జనాభా 1.05 కోట్లకు చేరుకుందని.. ఈ సంవత్సరం చివరి నాటికి ఆ సంఖ్య 1.08 కోట్లకు చేరనుందని ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం తాజాగా అంచనా వేసింది. జనాభా పరంగా భాగ్యనగరం దేశంలో 6వ స్థానంలో, ప్రపంచంలో 34వ స్థానంలో నిలిచినట్లు స్పష్టం చేసింది.
UN report on Hyderabad Population 2023 : తెలంగాణలో పెరిగిన పట్టణీకరణతో రాష్ట్ర జనాభాలో మూడవ వంతు రాజధానిలోనే నివాసం ఉంటోంది. 1950 ప్రాంతంలో హైదరాబాద్ జనాభా సుమారు 10 లక్షలకు పైగా ఉండగా.. 1975 నాటికి ఆ సంఖ్య 20 లక్షలు దాటేసింది. ఆ తర్వాత మరో పదిహేనేళ్లలో (1990 నాటికి) సుమారు 40 లక్షలకు పైగా పెరిగింది. ఆ తర్వాత మరో 20 ఏళ్లలో (2010 సంవత్సరం నాటికి) 80 లక్షలకు చేరుకుంది. ప్రస్తుత సంవత్సరానికి జనాభా సంఖ్య కోటి దాటేసింది.
Hyderabad News Today : ఒకప్పుడు భాగ్యనగరం అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీహెచ్) పరిధిలోని 170 చదరపు కిలోమీటర్ల పరిధి మాత్రమే. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఏర్పాటుతో ఆ పరిధి పెరిగి.. 650 చదరపు కిలోమీటర్లకు నగరం విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అవుతుంది. ఉపాధి రీత్యా ప్రతి సంవత్సరం సుమారు 5 లక్షల మంది నగరానికి వలస వచ్చి.. ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య వార్షికంగా 4.07 లక్షలు కాగా.. పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చే వారి సంఖ్య 88,216గా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం అంచనా వేసింది.
అవకాశాలు.. సవాళ్లు..: ఇదిలా ఉండగా.. రోజురోజుకు పెరుగుతోన్న జనాభాతో నిత్యం సవాళ్లతో పాటు అవకాశాలూ ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. కోటి దాటేసిన హైదరాబాద్ జనాభాలో 25 శాతం వరకు 14 ఏళ్లలోపు పిల్లలు ఉండగా.. 15 నుంచి 64 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న వారి సంఖ్య 60 శాతానికి పైగానే ఉంది. వీరంతా పని చేసే జనాభా. వీరందరిలో నైపుణ్యాలను పెంపొందిస్తే రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో.. తద్వారా దేశాభివృద్ధిలో కీలకంగా మారతారని చెబుతున్నారు. ఈ అవకాశాలతో పాటు జనాభాకు తగిన గృహ వసతి, నీటి సౌకర్యం, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ కల్పన, ప్రజా రవాణా వంటి సవాళ్లను అధిగమించాలంటే ముందుచూపుతో పాటు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
సంపన్న నగరాల జాబితాలోనూ చోటు..: మరోవైపు ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలోనూ హైదరాబాద్‌కు స్థానం దక్కింది. మొత్తం 97 నగరాలు ఈ జాబితాలో చోటు సంపాదించగా.. న్యూయార్క్ నగరం 3.40 లక్షల మిలియనీర్లతో తొలి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌కు 65వ స్థానం లభించింది. భాగ్యనగరంలో మొత్తం 11,100 మంది మిలియనీర్లు (దాదాపు రూ.8.2 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న వారు) ఉన్నట్లు ఓ సంస్థ తన అధ్యయనంలో తెలిపింది.
ఇవీ చూడండి..
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్- చైనా సెటైర్
Ramadan: రంజాన్ సీజన్ కదా.. రాత్రిపూట చార్మినార్ బజార్‌కు వెళ్లొద్దామా..?