రాష్ట్రానికి ఆక్సిజన్‌ను సరఫరా చేయడంలో దక్షిణ మధ్య రైల్వే కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి 3 వేల 719 మెట్రిక్ టన్నుల ప్రాణ వాయువును తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ఇది సాధ్యమైంది. క్లిష్ట సమయంలో వైద్య ఆక్సిజన్‌ను చేరవేయడంలో కృషి చేసిన అధికారులను, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రత్యేకంగా అభినందించారు.
దక్షిణ మధ్య రైల్వే.. రాష్ట్రానికి 1 మే 2021 తేదీన మొట్ట మొదటగా 63.06 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓను సరఫరా చేసింది. ఇప్పటిదాకా 40 రైళ్ల ద్వారా 3 వేల 719 మెట్రిక్ టన్నుల వైద్య ఆక్సిజన్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చింది. అలాగే ఏపీకి 56 రైళ్ల ద్వారా 3 వేల 628 మెట్రిక్ టన్నుల వైద్య ఆక్సిజన్‌ను చేరవేశారు. ఇలా వివిధ రాష్ట్రాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఇప్పటివరకు 7 వేల మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్‌ను సరఫరా చేసి కొవిడ్ చికిత్సలో కీలక పాత్ర పోషించింది.
దేశంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతాల నుంచి ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను నడిపించారు. పశ్చిమ బంగ నుంచి 80, ఛత్తీస్‌గఢ్ నుంచి 684, జార్ఖండ్ నుంచి 1,288, గుజరాత్ నుంచి 1,793, ఒడిశా నుంచి 3,501 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓను సరఫరా చేశారు. ఆక్సిజన్ అవసరాలను వీలైనంత త్వరగా తీర్చడానికి రైళ్లు తక్కువ సమయంలోనే గమ్య స్థానాలకు చేరేలా ద.మ రైల్వే.. గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేసింది. పర్యవేక్షణకు వివిధ విభాగాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వీటి ఫలితంగా రైళ్లు సగటున గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయి.
ఆక్సిజన్ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రైళ్లను వీలైనంత వేగంగా నడుపుతున్నాం. నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటున్నాం. ప్రక్రియ సజావుగా సాగేలా పర్యవేక్షణను ఇక మీదట కూడా కొనసాగిస్తాం.
- గజానన్ మాల్య, ద.మ రైల్వే జనరల్ మేనేజర్
ఇదీ చదవండి: Basavatarakam hospital: బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో మరో సదుపాయం