విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న జాతీయ విద్యా విధానం ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలపై తీవ్ర ప్రభావం చూపనుంది. డిగ్రీ కళాశాలలు చాలావరకు అటానమస్ హోదా సాధించే అవకాశం కనిపించడం లేదు. సరైన సౌకర్యాలు, కనీస భవనాలు లేకుండా నడుస్తున్నవే ఎక్కువగా ఉండటం వల్ల మూతపడే అవకాశమే ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న 15 ఏళ్లలో విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కళాశాలలు ఉండవు. అన్నీ అటానమస్ హోదా సాధించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే 130 కళాశాలలు మాత్రమే అర్హత సాధించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీ పరిధిలో 431 డిగ్రీ కళాశాలలున్నాయి. నగరంతోపాటు చుట్టుపక్కల జిల్లాల పరిధిలో ఇరుకైన అద్దె భవనాల్లో ఎక్కువ కొనసాగుతున్నాయి. కేవలం 130 కళాశాలలకే సొంత భవనాలున్నాయి. ఆయా కళాశాలలు అటానమస్ హోదా పొందాలంటే సొంత భవనం ఉండడం కానీ కనీసం 30 ఏళ్ల ప్రాతిపదికన లీజుకు తీసుకున్న భవనంలో కానీ ఉండాలి. ఓయూ పరిధిలో 5 ఏళ్ల లీజున్న భవనాలు ఉంటేనే డిగ్రీ కళాశాలలకు అనుమతిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా కళాశాలలన్నీ సొంత భవనాలు సమకూర్చుకోవాలి. నగరంలో భారీ ఖర్చు దృష్ట్యా వాటన్నింటినీ కచ్చితంగా నగర శివారుకు తరలించాల్సిన పరిస్థితి.
అరకొరగా ఉంటే అంతే..
అరకొర విద్యార్థుల సంఖ్యతో నెట్టుకొస్తున్న కళాశాలలు 40 వరకు ఉన్నాయి. వీటిల్లో 25 శాతం మేర మాత్రమే విద్యార్థులు చేరారు. ఇవి దాదాపు మూతపడనున్నాయి. కళాశాలలకు అటానమస్ హోదా రావాలంటే తొలుత న్యాక్ అక్రిడిటేషన్ ఉండాలి. అకడమిక్, బోధన, మౌలిక వసతులు ఉంటేనే న్యాక్ గ్రేడింగ్ సాధ్యమవుతుంది. ప్రస్తుతం 30 శాతం కళాశాలలకే న్యాక్ గ్రేడింగ్ ఉన్నందున అవన్నీ అటానమస్ హోదా సాధించడం పెద్దగా ఇబ్బంది ఉండదు.
అనుబంధ కళాశాలలు ఉండవు
కొత్త విద్యా విధానం ప్రకారం అన్ని కళాశాలలు అటానమస్ హోదా సాధిస్తే వచ్చే 15 ఏళ్లలో ఓయూకు అనుబంధ కళాశాలలు ఉండవు. ఆయా కళాశాలలన్నీ సొంతంగా సిలబస్, పరీక్షలు, ఇతరత్రా విద్యా కార్యక్రమాలు నిర్వహించే వీలు కలగనుంది. ‘‘జాతీయ విద్యా విధానం అమల్లోకి వస్తే అఫిలియేషన్ ప్రక్రియ పూర్తిగా మారనుంది. నేరుగా కేంద్ర ఉన్నత విద్యామండలి ద్వారా కళాశాలలు గుర్తింపు సాధిస్తాయి. రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయ పాత్ర కేంద్రీయ విశ్వవిద్యాలయాల తరహాలో మారనుంది. కేవలం బోధనకే పరిమితం కానున్నాయి. కళాశాలలు స్వయంసమృద్ధి సాధిస్తేనే అటానమస్ హోదా వచ్చే వీలుంటుంది.’’ అని ఉస్మానియా వర్సిటీ అకడమిక్ ఆడిట్ విభాగం సంచాలకుడు ప్రొ.సి.వేణుగోపాల్‌రావు అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి : పీఎస్‌కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు