Minister Harish Rao conducted a monthly review of NHM and TSM SIDCs: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది వైద్య కళాశాలల పనులు వేగవంతం చేయాలని, టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఎన్హెచ్ఎం, టీఎస్ఎం ఎస్ఐడీసీలపై మంత్రి నెలవారీ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్ధేశంలో ఒకేసారి ఎనిమిది కళాశాలలు ప్రారంభించి రికార్డు సృష్టించామని అన్నారు. ఇదే స్ఫూర్తితో కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ ఏడాది ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
పనులు త్వరగా పూర్తి చేయాలి: జాతీయ మెడికల్ కౌన్సిల్ బృందం పరిశీలనకు వచ్చేనాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని మంత్రి స్పష్టం చేశారు. నిర్మాణంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రాలను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. నిమ్స్, గాంధీ ఆసుపత్రుల్లో నిర్మిస్తున్న ఎంసీహెచ్ ఆసుపత్రులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. వైద్య విధాన పరిషత్ పరిధిలో కొనసాగుతున్న 23 సీహెచ్‌సీల పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ఇప్పటికే ఉన్న 20 తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లకు అదనంగా వివిధ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 13 సెంటర్లను త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేలా పనిచేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులకు స్పష్టం చేశారు.
అన్ని ఆస్పత్రుల్లో మందులు ఉండేలా చూడాలి: మార్చురీల పనులు, 12 సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. ఎక్కువగా రహదారి ప్రమాదాలు జరిగే ప్రాంతాల సమీపంలో 9 క్రిటికల్ కేర్ ఆసుపత్రుల ఏర్పాటు పనులు త్వరగా పూర్తి చేసి బాధితులకు సకాలంలో వైద్యం అందేలా చూడాలని అన్నారు. అన్ని ఆసుపత్రుల్లో ఔషధాలు అందుబాటులో ఉండేలా చూడాలని, మూడు నెలల బఫర్ స్టాక్ మెంటెయిన్ చేయాలని మంత్రి ఆదేశించారు. మందుల సరఫరాలో ఎలాంటి నియంత్రణ ఉండవద్దని, అవసరమైన మేరకు మందులు ఆయా ఆసుపత్రులకు పంపిణీ చేయాలని చెప్పారు. రియేజెంట్స్ కొరత లేకుండా లేకుండా చూసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, 24 గంటల్లోగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చూడాలని ఆయన తెలిపారు.
ఈ- ఉపకరణ్ పోర్టల్‌ను పూర్తిగా వినియోగించుకోవాలి: ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అన్ని వైద్య పరికరాలు నిత్యం పని చేసేలా ఉండే విధంగా తక్షణం మరమ్మతుల కోసం ఏర్పాటు చేసుకున్న ఈ- ఉపకరణ్ పోర్టల్‌ను పూర్తిగా వినియోగించుకుని సకాలంలో సిద్దం చేసుకోవాలని సూచించారు. ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూసుకోవడం సూపరింటెండెంట్ల బాధ్యత అని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తూ వైద్య పరికరాలు సమకూర్చుతోందని అవి ప్రజలకు పూర్తిస్థాయిలో సద్వినియోగపడేలా చూడటం అందరి బాధ్యత అని మంత్రి అధికారులకు చెప్పారు.
ఇవీ చదవండి: