DHARANI PROBLEMS: వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు పారదర్శకంగా, ఎలాంటి విచక్షణాధికారాలకు తావు లేకుండా సాఫీగా సాగాలన్న ధ్యేయంతో.. రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా లావాదేవీలు ఇబ్బందులు లేకుండా, త్వరగానే జరుగుతున్నాయి. అయితే ధరణి పోర్టల్‌లో డేటా పొందుపర్చిన సమయంలో జరిగిన తప్పిదాలు, పొరపాట్లు మాత్రం యజమానులకు సంకటంగా మారాయి. ఎక్కువ శాతం సాఫీగానే సాగుతున్నప్పటికీ తప్పిదాలు, పొరపాట్ల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా ఇందుకు సంబంధించి కసరత్తు చేసి కొన్ని మాడ్యూల్స్ సిఫారసు చేసింది. కొన్ని అందుబాటులోకి వచ్చాయి. అయితే మిగతా సమస్యలు పరిష్కారం కావడం లేదు. అదనపు మాడ్యూుల్స్ తీసుకురావాలని మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయించినప్పటికీ.. అవి ఇంకా అందుబాటులోకి రాలేదు.
సీఎం కేసీఆర్ ఆదేశాలు.. అటు తప్పిదాల సవరణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన కొన్ని ఐచ్ఛికాల ద్వారా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వాటిని పరిష్కరించేందుకు కలెక్టర్లకు ఇంకా లాగిన్ అవకాశం ఇవ్వకపోవడంతో అవి ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. ఇదే సమయంలో ధరణి సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారులకు పరిష్కారంపై ఆదేశాలు జారీ చేశారు. ప్రయోగాత్మకంగా ఒక గ్రామాన్ని ఎంచుకొని సమస్యలను గుర్తించి, పరిష్కరించి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఐదారు రకాలుగా సమస్యలు..: సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఇటీవల సిద్దిపేట జిల్లా ములుగులో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, సీఎస్ సోమేశ్‌కుమార్, సంబంధిత ఉన్నతాధికారులు పర్యటించి.. క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించారు. ఆ గ్రామంలో మొత్తం 186 ఫిర్యాదులు రాగా.. అందులో వంద వరకు న్యాయవివాదాలు, సాదా బైనామాలు తదితరాలు ఉన్నట్లు తేలింది. మిగిలిన 80 సమస్యలు తప్పిదాలు, పొరపాట్లు, ఇతర కారణాల వల్ల ఉత్పన్నమయ్యాయని.. వాటిని పరిష్కరించే అవకాశం ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. ఈ సమస్యలు ఐదారు రకాలుగా ఉన్నట్లు సమాచారం. పేర్లలో పొరపాట్లు, సర్వే విస్తీర్ణం నమోదులో తప్పిదాలు, భూమి వర్గీకరణ, ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూములను.. దశాబ్దాలుగా దున్ని అనుభవిస్తున్న రైతులకు వారి పేరున నమోదు కాకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.
వారం, పది రోజుల్లో..: ములుగులో గుర్తించిన సమస్యలను క్షేత్రస్థాయిలోనే వాటిని పరిష్కరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ సహా అధికారులు ఆ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. తాజాగా ఐఏఎస్ అధికారులు రజత్ కుమార్ షైనీ, సర్ఫ్‌రాజ్ అహ్మద్ కూడా మంగళవారం ములుగులో పర్యటించారు. వచ్చిన సమస్యలు, వర్గీకరణ, వాటి పరిష్కారం, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ములుగులో వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించి రైతులకు ధృవీకరణ పత్రాలు అందజేయనున్నారు. వారం, పది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత మండలం యూనిట్‌గా సమస్యలు గుర్తించి పరిష్కరిస్తారు. అనంతరం నియోజకవర్గం, ఆ తర్వాత రాష్ట్రం యూనిట్‌గా ధరణి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారు.
ఇవీ చూడండి..