ఇన్సూరెన్స్ మెడికల్ స్కామ్ కేసులో భారీ అవినీతి జరిగినట్లు అనిశా అధికారులు గుర్తించారు. ఓమ్ని మెడి అనే ఔషధ విక్రయాల సంస్థతో కలిపి దేవికా రాణి భారీ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధరించారు. శ్రీహరిబాబుతో కలిసి లెజెండ్ పేరుతో ఓ షెల్ కంపెనీ ఏర్పాటు చేసినట్లు.. యజమానిగా కృపాసాగర్ రెడ్డి ఉన్నట్లు గుర్తించారు.
12 కోట్ల మేర అక్రమాలు
2017-18 సంవత్సరంలో లెజెండ్ కంపెనీతో జరిగిన కొనుగోలు ఒప్పంద పత్రాలను అనిశా అధికారులు పరిశీలిస్తున్నారు. కేవలం రెండు ఒప్పంద పత్రాల్లోనే 110కోట్ల విలువైన ఔషధాలు కొనుగోలు చేసినట్లు సృష్టించారు. ఇందులో 12 కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. లెజెండ్ కంపెనీ ఖాతా నుంచి శ్రీహరి ఖాతాకు 54కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి.
రూ.11,800 కిట్‌ను రూ.36,800కు కొనుగోలు
తెల్ల రక్త కణాల కిట్స్ కొనుగోలులో భారీ అవినీతి జరిగినట్లు తేల్చారు. రూ.11,800 కిట్‌ను రూ.36,800కు కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడయింది. ఈ కొనుగోలు ప్రక్రియకు దేవికారాణి, పద్మ సహకరించినట్లు తేలింది. ఒమ్ని మెడితో పాటు... లెజెండ్ కంపెనీలో శ్రీహరికి, దేవికా రాణికి వాటాలున్నట్లు అధికారులు గుర్తించారు.
శ్రీహరిబాబుకు రూ.99 కోట్ల విలువైన షేర్లు
శ్రీహరిబాబుకు రూ.99 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని గుర్తించిన అనిశా... శ్రీహరి పేరుతో రూ.24 కోట్లు, ఆయన భార్య పేరుతో రూ.7 కోట్లు ఎఫ్‌డీలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. గ్లూకోజ్ క్యూయేట్ కొనుగోళ్లలోనూ సుమారు రూ.13 కోట్లు అధికంగా దోచుకున్నట్లు తెలిసింది. శ్రీహరిబాబు అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆయనను మరోసారి అదుపులోకి తీసుకుని విచారించారు.
ఇప్పటికే 21మంది అరెస్ట్
ఈ కేసులో ఇప్పటికే 21మందిని అరెస్ట్ చేశారు. ఇందులో దేవికారాణి, పద్మ, ఇందిరతో పాటు... పలువురు ఉద్యోగులను, ఔషధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులను ఉన్నారు. లెజెండ్ కంపెనీ ఎండీ కృపాసాగర్, ఒమ్ని మెడీ ఉద్యోగి వెంకటేశ్వర్ రెడ్డి పరారీలో ఉన్నారు. వీళ్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని అనిశా భావిస్తోంది.
ఇవీ చూడండి : బతికున్నవరకు మచ్చతెచ్చే పనిచేయను: ఈటల