పరవళ్లు తొక్కుతున్న కాళేశ్వరం గంగమ్మ ..! - Kaleshwaram Lift Irrigation Project Updates
రాష్ట్రంలో కాళేశ్వరం జలాల ఎత్తిపోత కొనసాగుతోంది. వరుస జలాశయాల్లో నిల్వ చేసిన నీటిని ఎల్లంపల్లి ద్వారా మధ్య, దిగువ మానేరుకు ఎత్తిపోస్తున్నారు. పునరుజ్జీవపథకం ద్వారా వరదకాల్వకు కూడా జలాలను తరలిస్తున్నారు. మరోవైపు తదుపరి పనులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఫలాలు సాకారమవుతున్నాయి. ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా ప్రాణహిత, గోదావరి జలాలు పంటపొలాలను చేరుతున్నాయి. అందుబాటులో ఉన్న జలాశయాలన్నింటినీ నింపుకొంటూ ఆయకట్టుకు సాగునీరందిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల ఇంకా కొనసాగుతోంది. మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మి జలాశయం వద్ద నీరు పూర్తి నిల్వస్థాయికి చేరుకున్నందున కొన్నాళ్లుగా అక్కడి నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు.
లక్ష్మి పంపుహౌస్ నుంచి ఎత్తిపోత నిలిపివేత
మహాశివరాత్రి దృష్ట్యా కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం వద్ద జలాలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో లక్ష్మి పంపుహౌస్ నుంచి జలాల ఎత్తిపోత తాత్కాలికంగా ఆపేశారు. ప్రస్తుతం లక్ష్మి జలాశయంలో 13 టీఎంసీలకుపైగా నీరుంది. శుక్రవారం రాత్రి నుంచి తిరిగి లక్ష్మి పంపుహౌస్‌లోని 11 పంపుల ద్వారా జలాలు ఎత్తిపోయనున్నారు. లక్ష్మి పంపుహౌస్ దిగువన సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంపుహౌస్‌ల నుంచి కూడా నీటిని ఎత్తిపోస్తున్నారు.
దశలవారీగా ఎత్తిపోతల ప్రక్రియ
కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి, రెండు లింకుల్లోనూ జలాలు ఎత్తిపోస్తున్నారు. దశలవారీగా ఎత్తిపోతల ప్రక్రియ కొనసాగుతోంది. ఎల్లంపల్లి జలాశయం ద్వారా మధ్యమానేరు, దిగువమానేరు జలాశయాలను పూర్తి స్థాయిలో నింపే దిశగా నీటిని తరలిస్తున్నారు. సీఎం ఆదేశాల మేరకు ఎస్సార్ఎస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా వరదకాల్వకు ఒక టీఎంసీల నీటిని తరలిస్తున్నారు.
జలాశయాలను ఖాళీ చేయాలని సీఎం ఆదేశం
లక్ష్మి, సరస్వతి, పార్వతి జలాశయాలకు సంబంధించిన ఆనకట్టలను పూర్తి స్థాయిలో పరిశీలించేందుకు వీలుగా వేసవి నాటి వరకు జలాశయాలను పూర్తిగా ఖాళీ చేయాలని సీఎం ఇటీవల ఆదేశించారు. అందుకు అనుగుణంగా నీటి ఎత్తిపోతల కొనసాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మేడిగడ్డ వద్ద లక్ష్మి జలాశయంలో నిల్వ చేసిన జలాలను 42 టీఎంసీలు ఎగువకు ఎత్తిపోశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండో లింక్‌లోని గాయత్రి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి 55 టీఎంసీలను మధ్యమానేరు జలాశయానికి తరలించారు. తదుపరి పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
ఎల్లంపల్లి వద్ద నీటిఎత్తిపోత
- ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు వరకు ప్రస్తుతం 1.9 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు వీలుగా జంటసొరంగాలు, పంపుహౌస్‌లను నిర్మించారు.
- మొత్తం మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా అదనపు పనులు చేపట్టాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా నీటిపారుదల శాఖ ఇప్పటికే పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
- ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు వరకు అదనంగా 1.1టీఎంసీ నీటిని రోజుకు 361 క్యూసెక్కుల చొప్పున ఎత్తిపోసేందుకు అనువుగా పనులకు అనుమతులిచ్చారు.
- కాల్వలు, పైప్ లైన్లు, ఎత్తిపోతల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు 11వేల 806 కోట్ల రూపాయల విలువైన పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు అయ్యాయి.
రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల్లో అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూర్చనుంది. కాళేశ్వరం నుంచి 530 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నీటిపారుదలశాఖ ఇంజినీర్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇవీ చూడండి: డీసీసీబీ పాలకవర్గాల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
TAGGED:
కాళేశ్వరం జలాల ఎత్తిపోత