తెలంగాణలో రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలు పెంచిన తర్వాత మొదటి రోజున నాలుగు వేలకుపైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలతోపాటు వ్యవసాయ భూములకు సంబంధించి మండల రెవెన్యూ కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు సజావుగా సాగినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు.
సోమవారం రోజున కిటకిటలాడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మంగళవారం బోసిపోయి కనిపించాయి. దాదాపు 11వేల డాక్యుమెంట్లు సోమవారం రిజిస్ట్రేషన్ కాగా మంగళవారం విలువలు పెరగడం వల్ల మందకొడిగా సాగి 4,346 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అయ్యి తద్వారా రూ.27.34 కోట్లు మేర ఆదాయం వచ్చింది.
మొదటి రోజున సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించిన ఉన్నతాధికారులు... అలాంటివి ఏమి రాకపోవడంతో.... ఊపిరి పీల్చుకున్నట్లైంది. విలువలు మాస్టర్ సర్వర్‌లో సజావుగా అప్‌లోడ్ కావడంతో తమ వద్ద ఉన్న మార్కెట్ విలువల రిజిస్ట్రార్‌తో పెద్దగా పని లేకుండా పోయిందని పలువురు సబ్ రిజిస్ట్రార్లు అభిప్రాయపడ్డారు.
గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో జనవరి 31న 3413 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవ్వగా.. రూ.46,11,84,410 ఆదాయం సమకూరింది. మంగళవారం మూడు జిల్లాల పరిధిలో డాక్యుమెంట్లు 150కి మించలేదు.
ఇదీ చదవండి: