కరోనా వైరస్ (కొవిడ్-19) నిర్ధరణ పరీక్షలు చేపట్టేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఈ మేరకు కేంద్ర బయోటెక్నాలజీ విభాగం(డీబీటీ) నుంచి వర్సిటీకి గురువారం లేఖ అందింది. ఈ నెల 20వ తేదీకల్లా సంబంధిత పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని సూచించింది. డీబీటీ నుంచి లేఖ రావడం వల్ల కరోనా నిర్ధరణ పరీక్షలకు పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నట్లు హెచ్‌సీయూ ఉపకులపతి పొదిలె అప్పారావు తెలిపారు.
ప్రస్తుతం హెచ్‌సీయూలో బయోసేఫ్టీ లెవల్-3 ల్యాబ్ అందుబాటులో ఉండటం వల్ల కరోనా నిర్ధరణ పరీక్షలు జరిపేందుకు సిద్ధమని గతంలో వర్సిటీ అధికారులు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కు లేఖ రాశారు. అదేవిధంగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్డీ)కూ సమాచారం అందించారు. దీంతో డీబీటీ నుంచి హెచ్‌సీయూలో కొవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి వచ్చింది. వర్సిటీలోని ల్యాబ్‌లో కరోనా నిర్ధరణకు 15కు పైగా యంత్రాలు ఉన్నాయి. ఇప్పటికే సిబ్బందికి సైతం శిక్షణ ఇచ్చారు. నిత్యం 800 నమూనాలను పరీక్షించే సామర్థ్యం కూడా ఉంది. సేకరించిన నమూనాలను ప్రభుత్వ ఆసుపత్రులు అందిస్తే.. వాటిని ప్రాసెస్ చేసి హెచ్‌సీయూకు తీసుకువస్తారు. అనంతరం స్థానికంగా కరోనా నిర్ధరణ పరీక్షలు చేపడతారు. ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసేందుకు సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)కు కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. హెచ్‌సీయూతోపాటు గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలోనూ కరోనా పరీక్షలకు అనుమతి దక్కింది.
ఇదీ చూడండి: ప్రపంచదేశాలకు 1 ట్రిలియన్ డాలర్ల రుణం: ఐఎంఎఫ్