New National Electricity Policy Draft: దేశమంతా 2022 నుంచి 2032 వరకు వచ్చే పదేళ్ల పాటు అమలు చేసేందుకు నూతన జాతీయ విద్యుత్ విధానం ముసాయిదాను కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ, సంప్రదాయేతర ఇంధనం.. ఇలా అన్ని విభాగాల్లో పలు సంస్కరణలను ప్రతిపాదించింది.
No Free electricity in India : వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయాలను ఈ నెల 22లోగా పంపాలని స్పష్టం చేసింది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు వీటికి సమాధానాలను పంపేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఉచిత కరెంటు అనేదే లేదని ఇందులో కేంద్రం స్పష్టం చేసింది. ఏ వినియోగదారుడికైనా ఉచితంగా లేదా రాయితీపై కరెంటు సరఫరా చేయాలని రాష్ట్రాలు నిర్ణయిస్తే దానికయ్యే పూర్తి ఛార్జీల సొమ్మును నిర్ణీత గడువు తేదీలోగా డిస్కంకు ముందుగా చెల్లించాలని తెలిపింది. ఇలా చెల్లించలేని పక్షంలో కరెంటు సరఫరా నిలిపివేయాలని తేల్చిచెప్పింది.
No Free electricity in Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం వ్యవసాయానికి, 101 యూనిట్లలోపు కరెంటు వినియోగించే ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తోంది. ఇంకా స్పిన్నింగ్ మిల్లులు, క్షౌరశాలలు వంటి వాటికి ఛార్జీ తగ్గించి రాయితీపై ఇస్తోంది. ఈ రాయితీలన్నింటికీ కలిపి వచ్చే ఏడాది బడ్జెట్‌లో రూ.12 వేల 717 కోట్లు కేటాయించింది.
కానీ ఈ సొమ్మును ఒకేసారి ఇవ్వకుండా నెలవారీగా రూ.875 కోట్ల చొప్పున ఇస్తోంది. నెలకు మరో రూ.400 కోట్లు అయినా పెంచి ఇవ్వాలని డిస్కంలు అడుగుతున్నాయి. పైగా అన్ని రాయితీలకు ఈ సొమ్ము సరిపోనందున డిస్కంలు నష్టాలపాలవుతున్నాయి. ఇలాంటి సమస్యలు దేశవ్యాప్తంగా ఉన్నందున ఇక నుంచి రాయితీల సొమ్ము పూర్తిగా ముందే విడుదల చేస్తేనే ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, లేదంటే ఆపేయాలని కొత్త విధానంలో కేంద్రం ప్రతిపాదించింది. ఇలాగే మరికొన్ని కీలక సంస్కరణలను కూడా చేర్చింది.
ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వెంటనే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలని ముసాయిదాలో స్పష్టం చేసింది. గ్రామాల్లో పంపిణీ, సరఫరాలో నష్టాలను తగ్గించేందుకు వ్యవసాయం, ఇళ్లకు కరెంటు సరఫరా చేసే ఫీడర్లను విడదీసి అన్నిచోట్లా సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
వచ్చే ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో వాడే కరెంటులో సగం సౌర, పవన విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధనం తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తేల్చింది. డిస్కంల పని తీరు మెరుగుపడేందుకు ప్రైవేటు పెట్టుబడులు రాబట్టి, వాటిని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో నడిపేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. పీపీపీ బిడ్డింగ్ మార్గదర్శకాల పత్రాలను కేంద్రం విడుదల చేస్తుందని.. ప్రాంతాల వారీగా పంపిణీ బాధ్యతలను ప్రైవేటు పరం చేయాలని తేల్చింది.
ఎన్ని యూనిట్ల కరెంటును రాయితీపై సరఫరా చేశారనే లెక్కలను పక్కాగా నిర్వహించాలని.. అన్ని స్థాయుల్లో మీటర్లు పెట్టి పారదర్శకంగా లెక్కించాలని కేంద్రం స్పష్టం చేసింది. వ్యవసాయ బోరు మోటార్లన్నింటికీ సౌర విద్యుత్ ఏర్పాటు చేయాలని, దీనివల్ల వ్యవసాయ విద్యుత్ రాయితీల భారం రాష్ట్రాలకు తగ్గుతుందని తెలిపింది.
డిస్కంలు కరెంటు ఎంతకు కొంటున్నాయి? సరఫరా తరవాత ఎంత ఆదాయం వస్తుందనేది లెక్కించి పూర్తి సొమ్ము వసూలయ్యేలా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని తెలిపింది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చేలా మండలి కరెంటు ఛార్జీలను నిర్ణయించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం విద్యుత్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలో పని చేస్తున్నందున తమకు నచ్చిన అధికారులను, రిటైరైనవారిని సంస్థ పాలకమండలి సభ్యులుగా నియమిస్తోందని తెలిపింది. ఇక నుంచి ప్రతి సంస్థ పాలకమండలిలో ప్రైవేటు రంగాలకు చెందిన నిపుణుల నుంచి ఒకరిని నియమించాలని కేంద్రం స్పష్టం చేసింది.
ఇవీ చూడండి..
అన్నదాతలను వెంటాడుతున్న కరెంట్ కష్టాలు.. యాసంగి గట్టెక్కేనా..!
రాయితీ ఇవ్వండి.. సర్కార్‌కు నాయి బ్రాహ్మణులు, రజకుల విజ్ఞప్తి