రాష్ట్రంలోని జూపార్కులు, జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఫలితంగా హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ తిరిగి తెరచుకుంది. ఉదయం 8.30 గంటలకు అధికారులు జూ పార్క్‌ను పునఃప్రారంభించారు. కొవిడ్ కారణంగా నెలల తరబడి ఇళ్లలోనే గడిపిన నగర ప్రజలు సేదతీరేందుకు జూకు క్యూ కట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి పార్కులో ఆహ్లాదంగా గడిపారు. మధ్యాహ్నం వరకు సుమారు 1,100 మంది పర్యాటకులు జూను సందర్శించారు.
సందర్శకులకు మార్గదర్శకాలు..
ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే అధికారులు పర్యాటకులను లోనికి అనుమతిస్తున్నారు. టికెట్ కౌంటర్ వద్ద భౌతిక దూరం పాటించేలా వృత్తాలు ఏర్పాటు చేశారు. జలుబు లేదా జ్వరం ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించడం లేదు. పది సంవత్సరాల లోపు చిన్నారులతో పాటు 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఆదివారాలు, సెలవు దినాల్లో జూ సందర్శనకు రాకపోవడం మంచిదని అధికారులు సూచించారు. జంతు ప్రదర్శన శాలలో సఫారీ పార్క్, సర్పాల గృహం, అక్వేరియం, ఫాజిల్ మ్యూజియం, నాచురల్ హిస్టరీ మ్యూజియం మూసివేసినట్లు వెల్లడించారు. ప్రవేశ ద్వారం వద్ద రసాయన మ్యాట్లను ఏర్పాటు చేశామన్నారు.
మాస్క్ తప్పనిసరి..
జూ పార్క్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవాలని.. లేని పక్షంలో రూ.200 జరిమానా విధిస్తామని జూ అధికారులు వెల్లడించారు. జూ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఉమ్మివేయడం నేరమని.. అతిక్రమిస్తే రూ.1,000 జరిమానా వేస్తామన్నారు. ఒక వేళ జూ అధికారులు, సిబ్బంది మాస్కులు ధరించకపోతే సందర్శకులు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సందర్శకుల కోసం అక్కడక్కడ శానిటైజర్లను ఏర్పాటు చేశామని.. జూ పార్క్‌లో ప్రతి రోజూ రెండు సార్లు శానిటైజర్ పిచికారీ చేస్తున్నామని వివరించారు.
మరోవైపు చాలా రోజుల తర్వాత జూ తిరిగి తెరుచుకోవడం పట్ల పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడపడం ఆనందాన్నిచ్చిందన్నారు.
ఇదీ చూడండి: Yadadri temple: యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. రద్దీగా క్యూలైన్లు