రాష్ట్రంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. సినిమా థియేటర్లు యథావిధిగా నడుస్తాయని సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లు మూతపడనున్నాయని జరుగుతున్న ప్రచారం అబద్ధమని తేల్చిచెప్పారు.
థియేటర్ల మూసివేత అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చిత్ర పరిశ్రమ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ రంగంపై ఆధారపడిన వివిధ విభాగాల్లోని కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుందని గుర్తు చేశారు.
ప్రభుత్వం జారీ చేసిన కరోనా మార్గదర్శకాలను థియేటర్ల యాజమాన్యాలు తప్పనిసరిగా పాటించాలని మంత్రి సూచించారు. రోజురోజుకూ కరోనా కోరలు చాస్తున్న కారణంగా మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. మాస్కులు, భౌతిక దూరం విస్మరించవద్దని ప్రజలకు సూచించారు.
ఇదీ చూడండి: కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళన