వికసిస్తున్న కమలం...
ఇప్పటికే కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు డీకే అరుణ, తెరాస లోక్‌సభాపక్ష నేత జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి కమలం గూటికి చేరారు. తాజాగా మాజీ మంత్రి విజయరామరావు సైతం కాషాయ జెండా కప్పుకొనబోతున్నారనే ముచ్చట వినిపిస్తోంది.మెుదటి నుంచి తెరాసపై ఒంటి కాలుమీద లేచే నేతలతో పాటు మరికొంత మంది రాష్ట్రస్థాయి నేతలు వీరి బాటలోనే నడిచే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికిసంస్థాగతంగా బలపడే దిశగా కమలం అడుగులు వేస్తోంది.
పాలమూరు పార్లమెంట్‌పై కన్నేసిన కమలం...
లోక్‌సభ ఎన్నికల్లో కనీసం రెండు నుంచి మూడు స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా భాజపా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే ఇటీవలే పార్టీలో చేరిన డీకే అరుణకు పాలమూరు నుంచి అవకాశం కల్పించింది. ఆమెకు తోడు అదే జిల్లాకు చెందిన తెరాస లోక్‌సభాపక్ష నేత జితేందర్ రెడ్డి చేరడం కాషాయ దళంలో జోష్ పెరిగింది.రాజకీయలకు కొత్తైన వ్యాపారవేత్త మన్నే శ్రీనివాస్ రెడ్డిని తెరాస బరిలోకి దింపింది. శ్రీనివాస్ రెడ్డి గద్వాల జేజమ్మను ఎదుర్కొనగలరా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
అలాగే సికింద్రాబాద్లోను అదే పరిస్థితి కనిపిస్తోంది. భాజపా నుంచి సీనియర్ నేత కిషన్ రెడ్డి బరిలోకి దిగగా , తెరాస మాత్రం తలసాని తనయుడిని పోటీకి దింపింది. నిజామాబాద్‌లో రైతులను ఆకర్షించేందుకు ఏకంగా కేంద్రంలో అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ ప్రకటించారు. ఇక్కడ డీఎస్ తనయుడు ధర్మపురి అర్వింద్‌ను రంగంలోకి దింపారు. అర్వింద్ సామాజిక వర్గం, సంస్థాగతంగా పార్టీ బలంగా ఉండటంతో పాటు పసుపు బోర్డు ప్రకటన కలిసివస్తుందని కమలదళం నేతలు ఆశతో ఉన్నారు.
కేంద్రంలో మళ్లీరాబోయేది తమ ప్రభుత్వమే అని కమల నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే... తెరాస సైతం ఈసారి దిల్లీలో ప్రధాన మంత్రిని నిర్ణయించేది ప్రాంతీయ పార్టీలేననిపలు ప్రచార సభల్లో కేసీఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కమలానికి అనుకూలంగా వస్తే...రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది.
ఇవీ చూడండి:తెలంగాణలో మంత్రులకు లోక్‌సభ పరీక్ష...!