ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, ప్రగతి శీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య, పీడీఎస్యూ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు పోలీసులకు వారికి తీవ్ర వాగ్వాదం జరిగింది. అశ్వత్థామ రెడ్డి... ఇంటి గేటు ఎక్కిన సంధ్య... తోసుకుని లోపలికి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
'ఆనాడు కేసీఆర్ దీక్ష సరైందే అయితే ఇప్పుడు ఇదీ సహేతుకమే'
ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ సంధ్య తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన దీక్షలు సరైనవే అయితే పొట్ట కూటి కోసం ఇప్పుడు కార్మికులు చేస్తున్న సమ్మె కూడా సహేతుకమేనని సంధ్య అన్నారు. జేఏసీ నాయకుడు అశ్వత్థామ రెడ్డిని గృహ నిర్బంధం చేయడాన్ని తప్పుపట్టిన మందకృష్ణ... వెంటనే ఆయన్ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్కడే గేటు బయట ఆందోళన చేస్తున్న కొంత మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు.