Tenders For Manufacture Smart Meters: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎడాపెడా చేస్తున్న అప్పులతో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు 15వ తేదీకీ పూర్తిగా జీతాలివ్వలేని దుస్థితి నెలకొంది. చెల్లించాల్సిన బిల్లులు సుమారు రూ.1.70 లక్షల కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలోని 6 వేల కిలో మీటర్లల రహదారుల పునరుద్ధరణకు రూ.17,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసినా, ఇంతవరకూ నిధులివ్వలేకపోయారు.
రాష్ట్రం ఆర్థికంగా ఇంత దుర్భర పరిస్థితుల్లో ఉంటే.. డిస్కంలు రోజురోజుకీ అప్పుల భారంతో కునారిల్లుతుంటే.. ఏమాత్రం అవసరంలేని స్మార్ట్‌మీటర్లకు రూ.5600 కోట్లు ఖర్చుచేయడానికి ప్రభుత్వం సిద్ధపడటం వెనుక ఆంతర్యమేంటి అనే ప్రశ్న వినిపిస్తోంది. స్మార్ట్‌మీటర్ల కాంట్రాక్టును అస్మదీయులకు పంచిపెట్టడమే అసలు ఉద్దేశమా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాన్ని సమర్థించుకోవడానికి.. రైతులపై భారమేమీ వేయట్లేదని, ఉచితంగానే మీటర్లు అమరుస్తున్నామన్న అడ్డగోలు వాదన వినిపిస్తున్నారు.
రూ.5,600 కోట్లలో రాష్ట్రంపై పడే భారం.. రూ.4,000 కోట్ల అని, మిగతా రూ.1600 కోట్లు కేంద్రం గ్రాంటుగా ఇస్తోందని చెప్పడం ఎవర్ని మభ్యపెట్టడానికి? మీటర్ల వ్యయాన్ని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు భరిస్తే.. అది ప్రజాధనం కాదా? పన్నుల రూపంలో ముక్కుపిండి వసూలు చేసిన డబ్బు కాదా? .. రాష్ట్రంలోని మూడు డిస్కంలపై అప్పుల భారం రూ.56,000 కోట్ల రూపాయలుగా ఉంది. అసలు, వడ్డీ తీర్చడానికి ప్రతి నెలా డిస్కంలు సుమారు రూ.800 కోట్లు వెచ్చిస్తున్నాయి.
అవసరం లేని స్మార్ట్‌మీటర్ల కోసం ఖర్చు: ఇలాంటి పరిస్థితిలో ఏమాత్రం విజ్ఞత ఉన్న ప్రభుత్వమైనా ఏం చేయాలి? డిస్కంలపై అప్పుల భారం తగ్గించేందుకు.. ఆదాయం పెంచేందుకు చర్యలు చేపట్టాలి. ఇప్పుడు స్మార్ట్‌మీటర్లపై ఖర్చు పెట్టాలనుకుంటున్న రూ.4,000 కోట్లు డిస్కంలకు ఇస్తే, అప్పుల భారం నుంచి కాస్తోకూస్తో ఊరట లభిస్తుంది. కానీ జగన్ ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసా?.. రూ.4,000 కోట్లను అవసరం లేని స్మార్ట్‌మీటర్ల కోసం ఖర్చు పెడుతోంది. పోనీ దానివల్ల రైతులకు ఒరిగేదేమైనా ఉందా అంటే.. అదీ లేదు.
శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటుచేసిన ఐఆర్‌డీ మీటర్లనే ప్రకృతి శక్తుల నుంచి కాపాడటం కష్టమైంది. వాటికంటే సున్నితమైన స్మార్ట్‌మీటర్లను కాపాడటం మరింత కష్టం. అంత భారీసంఖ్యలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడంలోని కష్టనష్టాల్ని గుర్తించింది. కాబట్టే కేంద్ర విద్యుత్‌శాఖ ఆర్డీఎస్ఎస్ పథకం పరిధిలోంచి.. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్ల అంశాన్ని తప్పించిందని డిస్కంలకు రాసిన లేఖలో విజయానంద్ పేర్కొన్నారు.
ప్రభుత్వానికి ఎందుకంత ఆరాటం?: కేంద్రమే మీటర్లు అక్కర్లేదన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత ఆరాటం? డిస్కంలు ఇప్పుడు టెండర్లు పిలుస్తోంది మీటర్లు అమర్చి, ఐదేళ్లు నిర్వహించేందుకే. ఐదేళ్ల తర్వాత ఆ మీటర్లను నిర్వహించేదెవరు? అప్పుడు మళ్లీ వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తారా? అసలు అవసరమే లేనప్పుడు.. రూ.5600 కోట్లు వెచ్చించి మీటర్లు పెట్టాల్సిన అవసరమేంటి ? వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్లు పెడితే విద్యుత్ ఆదా అవుతుందని ప్రభుత్వం వినిపిస్తున్న మరో విచిత్రమైన వాదన.
స్మార్ట్‌మీటర్ తెచ్చి పెట్టుకుంటే విద్యుత్ ఎలా ఆదా అవుతుంది: శ్రీకాకుళం జిల్లాలో ఐఆర్‌డీ మీటర్లు ఏర్పాటుచేస్తే 33శాతం విద్యుత్ ఆదా అయ్యిందని చెబుతోంది. ఎవరైనా విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలంటే... వాడుతున్న ఉపకరణాల సంఖ్య, లేదా సమయం తగ్గించుకోవాలి. లేదా విద్యుత్తును ఆదా చేసే ఉపకరణాలనైనా వినియోగించాలి. ఒక స్మార్ట్‌మీటర్ తెచ్చి పెట్టుకుంటే విద్యుత్ ఎలా ఆదా అవుతుంది అంటే సమాధానమే లేదు. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టులో ఒక్కో ఐఆర్‌డీ పోర్ట్ మీటర్, అనుబంధ పరికరాలకైన ఖర్చు రూ.2,583 కోట్లు.. ఆ లెక్కన 18.58 లక్షల మీటర్ల వ్యయం రూ. 480.12 కోట్లు. ఐదేళ్ల నిర్వహణ వ్యయం రూ.390.3 కోట్లు. మొత్తం ఐదేళ్లకయ్యే ఖర్చు రూ. 870.4 కోట్లు. స్మార్ట్ మీటర్లకయ్యే ఖర్చు దీనికంటే 7.8 రెట్లు ఎక్కువ అని సెప్టెంబరు 15న డిస్కంలకు రాసిన లేఖలో విజయానంద్ పేర్కొన్నారు.
ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేయొచ్చు?: ఇప్పుడు డిస్కంలు స్మార్ట్ మీటర్లకు రూ.5,600 కోట్ల అంచనాతో టెండర్లు పిలుస్తున్నాయి. ఇది వృథా ఖర్చు కాదా? 4 వేల కోట్లుంటే ఎన్ని ప్రజలకు ఉపయోగపడే పనులు ఎన్నో చేయొచ్చు? వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి ప్రకాశం, నెల్లూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు చెందిన 4 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. దానివల్ల ఎకరానికి రూ.5000 చొప్పున ఆదాయం పెరుగుతుందనుకున్నా.. ఒక్కో సీజన్‌కి రైతులకు రూ.200 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది.
అస్మదీయులకు కట్టబెట్టేందుకు: వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు, ఐదేళ్ల నిర్వహణ కాంట్రాక్టును అస్మదీయులకు కట్టబెట్టేందుకు సుమారు రూ. 6,480 కోట్ల అంచనా వ్యయంతో 2021 అక్టోబరులోనే టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియంతా పూర్తయ్యి పనులు కట్టబెట్టే తరుణంలో డిస్కంలు నిర్ణయించిన ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయని.. అసలు వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్లు అవసరం లేదని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ వరుసగా లేఖలు రాయడంతో తాత్కాలికంగా ఒక అడుగు వెనక్కు తగ్గిన ప్రభుత్వం ఆ టెండర్లు రద్దుచేసింది.
ప్రభుత్వ సూచన మేరకు అంచనా వ్యయంలో రూ.880 కోట్లు తగ్గించి.. రూ.5,600 కోట్లతో డిస్కంలు మళ్లీ టెండర్లు పిలుస్తున్నాయి. ఇదివరకు మీటర్లు, అనుబంధ పరికరాలు, ఐదేళ్ల నిర్వహణకు ఒకే టెండర్ పిలిచిన డిస్కంలు.. అంచనా వ్యయాన్ని తగ్గించి చూపేందుకు ఇప్పుడు మూడు ముక్కలు చేసి టెండర్లు పిలుస్తున్నాయి. అనుబంధ పరికరాల కోసం మూడు డిస్కంలు ఇప్పటికే టెండర్లు పిలిచేశాయి.
ప్రభుత్వం చేస్తున్నదే కరెక్ట్: స్మార్ట్‌మీటర్లు నిరర్థకమని సవివరంగా లేఖ రాసిన ఉన్నతాధికారితోనే... దానికి పూర్తి భిన్నమైన వాదన వినిపించేలా చేసి, ప్రభుత్వం చేస్తున్నదే కరెక్ట్ అని చెప్పించిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అత్యంత ప్రాధాన్యమిస్తున్న అదానీ సంస్థ.. మీటర్ల తయారీ రంగంలోకి ప్రవేశిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కీలకమైన విద్యుత్ ప్రాజెక్టులతో పాటు, ఇతర ప్రాజెక్టుల కేటాయింపులోనూ అదానీకి అగ్ర ప్రాధాన్యం లభిస్తున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: తెలంగాణలో ఉద్యోగ ప్రకటనల నామ సంవత్సరంగా 2022
'ఓటీపీ ఎవరికి చెప్పకండి.. ఆధార్‌ను ఎక్కడపడితే అక్కడ వదిలేయకండి'.. ప్రజలకు కేంద్రం సూచన