Tenant farmers plights: రాష్ట్రంలో పంటలు సాగు చేస్తున్న రైతుల్లో 35.6 శాతం మంది కౌలురైతులు ఉండగా వారిలో 69 శాతం మంది వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. తమకున్న ఎకరా, అరెకరాకు తోడు మరికొంత కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నవారు.. వచ్చే ఆదాయం సరిపోక కూలిపనులు చేస్తున్నారు. కౌలురైతుల్లో అసలు భూమి లేనివారు 19 శాతం మంది ఉండగా వారంతా జీవనోపాధికి అవస్థలు పడుతున్నారు.
రైతు స్వరాజ్య వేదిక(స్వచ్ఛంద సంస్థ) అధ్యయన నివేదిక ప్రకారం కొన్ని జిల్లాల్లో వ్యవసాయ కూలిపనులే జీవనాధారమైనవారు పెద్దసంఖ్యలో ఉన్నట్లు తేలింది. ఈ కుటుంబాలకు చెందిన కొందరు ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లుగా, హమాలీలుగా ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ పొరుగు జిల్లాల్లోని యువత బేల్దారీ, సెంట్రింగ్, రాడ్ బెండింగ్ తదితర పనులకు వెళ్తున్నారు.
వ్యవసాయమే జీవనాధారం: సాగంటే పంట కోయడమొక్కటే కాదు. దుక్కిదున్నడం నుంచి పంట మార్కెట్‌కు చేరే వరకు తొమ్మిది కీలక దశలు ఉంటాయి. వీటన్నింటిలోనూ వ్యవసాయ కూలీల పాత్ర కీలకం. గ్రామీణ ప్రాంతాల్లో సాగు తప్ప మరే ఇతర పనులూ ఉండవు. దీంతో ఇక్కడి కుటుంబాలు సేద్యంపైనే ఆధారపడుతున్నాయి.
* ఖమ్మం జిల్లాలో 83.55 శాతం మంది కౌలురైతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్లుగా 2.63 శాతం, ఆటో డ్రైవర్లుగా 1.32 శాతం మంది ఉన్నారు. నల్గొండ జిల్లాలో 82.30 శాతం మంది వ్యవసాయ కూలీలు కాగా, పాడిపై 7.14 శాతం, ఆటోడ్రైవర్లుగా 1.55 శాతం, హమాలీ, ఇతర పనులపై మిగిలినవారు జీవిస్తున్నారు.
* మెదక్ జిల్లాలో వ్యవసాయ కూలీలుగా 78.06 శాతం మంది ఆధారపడుతుండగా ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లుగా 6 శాతం, హమాలీలుగా 13 శాతం, మిగిలిన వారు బీడీలు చుట్టడం, ఇతర కూలిపనులు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 69.23 శాతం మంది కూలీలు కాగా, 26 శాతం పాడి పశువుల పెంపకం, 3 శాతం మంది ఆటోడ్రైవర్లు, మిగిలినవారు ఇతర పనులు చేస్తున్నారు.
వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్నవారు కౌలురైతులు. చిన్న కమతాల వారూ కొంత భూమి సాగుచేసుకుంటూనే, అలా వచ్చే ఆదాయం సరిపోక వ్యవసాయ కూలిపనులకు వెళ్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఇతర కూలిపనులు కూడా చేసి కుటుంబాన్ని నెట్టుకురావాల్సిన దీనస్థితి ఉంది.
ఇవీ చదవండి: