Temperature in Telangana : రాష్ట్రంలోని కరీంనగర్, ఖమ్మం, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం రోజున సూర్యుడు సెగలు కక్కాడు. ఈ జిల్లాల్లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ లేని స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వేడి తీవ్రత ఒక్కసారిగా పెరిగిందని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వెల్లడించారు. శనివారం రాష్ట్రంలోనే గరిష్ఠంగా కరీంనగర్‌లోని వీణవంక మండలంలో 45.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు ప్రకటించారు.
Highest Temperature in Veenavanka : జగిత్యాల జిల్లాలో ధర్మపురి మండలంలోని జైన, బుద్దేశ్‌పల్లి, సారంగాపూర్, ఇబ్రహీంపట్నం మండలం గోధూరు, మల్లాపూర్ మండలం రాఘవపేట, వెల్గటూరు మండల కేంద్రాల్లో 44.6 నుంచి 45.4 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో ముదిగొండ, నేలకొండపల్లి, చింతకాని ప్రాంతాల్లో.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, రంగంపల్లి, పాల్తెం.. నిజామాబాద్ జిల్లా ముప్కాల్, జక్రాన్‌పల్లి మండలాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. హైదరాబాద్ నగరంలో గరిష్ఠంగా ఖైరతాబాద్‌లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మరో వారం రోజుల పాటు పెరగనున్న ఎండ తీవ్రత : ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మరింతగా ఎండ తీవ్రత నమోదయ్యే సూచనలు ఉన్నట్లు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రం వైపు వాయవ్య దిశ నుంచి దిగువ స్థాయి గాలులు వీస్తున్నాయని అన్నారు. ఈ ప్రభావంతో వేడి తీవ్రత మరింత కొనసాగుతుందని సూచిస్తున్నారు. సాధారణం కన్నా రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారు 41 డిగ్రీల వరకు నమోదవుతాయని పేర్కొన్నారు. నగరంలో వారం రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త శ్రావణి వివరించారు. ఈ వారం రోజులు కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు- గరిష్ఠ ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రోజురోజుకు ఎండలు ముదురుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు (డిగ్రీల సెల్సియస్‌లలో) :
జిల్లా | ప్రాంతం | ఉష్ణోగ్రత |
కరీంనగర్ | వీణవంక | 45.8 |
జగిత్యాల | జైన (ధర్మపురి) | 45.4 |
జగిత్యాల | ధర్మపురి | 45.3 |
ఖమ్మం | పమ్మి (ముదుగొండ) | 45 |
జగిత్యాల | సారాంగాపూర్ | 45 |
నిజమాబాద్ | జక్రాన్‌పల్లి | 45 |
పెద్దపల్లి | పెద్దపల్లి | 44.7 |
మంచిర్యాల | జన్నారం | 44.7 |
ఇవీ చదవండి: