అంతర్రాష్ట్ర ఆర్టీసీ ఒప్పందంపై తెలంగాణ-ఏపీ సంస్థల ఎండీలు, ప్రిన్సిపల్ కార్యదర్శులు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో భేటీ కానున్నారు. ఏపీ-తెలంగాణ అంతరాష్ట్ర బస్సు సర్వీసుల అవగాహన, ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ఆ వెంటనే అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభించనున్నట్లు సమాచారం.
లాక్‌డౌన్‌కు ముందు ఏపీఎస్‌ఆర్టీసీ.. తెలంగాణకు నిత్యం 1,009 సర్వీసులు నడిపేది. ఇప్పుడు ఆ సంఖ్య 638కే పరిమితం కానుంది. ఏపీఎస్ఆర్టీసీకి 371 సర్వీసులు తగ్గనున్నాయి. టీఎస్‌ఆర్టీసీ గతంలో ఏపీకి 750 సర్వీసులు నడిపేది. ఇప్పుడు 820 వరకు పెరగనున్నాయి. టీఎస్‌ఆర్టీసీ డిమాండు మేరకు 1.61 లక్షల కి.మీ.మేర సర్వీసులకే ఏపీఎస్‌ఆర్టీసీ అంగీకరించడం వల్ల ఆర్టీసీల ఎండీల మధ్య ఒప్పందానికి మార్గం సుగమమైంది.
రాష్ట్ర విభజన తర్వాత ఆర్టీసీ బస్సుల రాకపోకల కోసం రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం జరగలేదు. సమన్యాయం ప్రాతిపదికన రెండు రాష్ట్రాలూ కిలోమీటర్లు, సర్వీసులు సమానంగా నడిపేందుకు ఒప్పందం చేసుకున్న తర్వాతే ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు నడపాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు స్పష్టం చేయగా బస్సులకు బ్రేకులు పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కన్నా తెలంగాణ ఆర్టీసీ 350 కిలోమీటర్ల అధికంగా బస్సులు నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల వరకు ఆంధ్రప్రదేశ్ 1.12 లక్షల కిలోమీటర్లు అదనంగా నడిపింది. చర్చల అనంతరం రెండు రాష్ట్రాల ఆర్టీసీలు కిలోమీటర్లు, సర్వీసుల విషయంలో స్వల్ప వ్యత్యాసంతో సమ న్యాయాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో అవసరమైతే రెండు రాష్ట్రాలు చర్చించుకుని సమన్యాయం ప్రాతిపదికనే కిలోమీటర్లు పెంచుకోనున్నట్లు అధికారవర్గాలు స్పష్టం చేశాయి.