konijeti rosaiah : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతితో హైదరాబాద్ నగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బల్కంపేటలోని ధరంకరం రోడ్డులోని నివాసానికి వెళ్లి పలువురు... ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనకు భాగ్యనగరంతో నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉంది. 1978 నుంచి నగరంలో నివాసం ఉంటున్నారు. సాధారణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కువగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో నివాసం ఉండేవారు. అందుకు భిన్నంగా రోశయ్య బల్కంపేట ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.
konijeti rosaiah death : సాధారణ ప్రజలతో మమేకమయ్యేవారు. 2009లో రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక బల్కంపేట నుంచే రాకపోకలు సాగించేవారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య మెట్రోరైలు ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రోరైలు ఒప్పందం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో జరిగింది. 2010 సెప్టెంబరు 4న అప్పటి సీఎం రోశయ్య సమక్షంలో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ, ప్రభుత్వం తరఫున హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ మధ్య ఒప్పందం జరిగింది. మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఆయనకు నివాళులు అర్పిస్తూ ఒప్పందం నాటి ఫొటోను ట్వీట్ చేశారు. రోశయ్య బల్కంపేట ఎల్లమ్మ తల్లికి పెద్ద భక్తులు. ఆలయానికి పెద్ద దాత. అమ్మవారిని ఎంతో ఇష్టంగా కొలిచేవారు. దేవస్థానానికి కొద్దిదూరంలోనే ఆయన నివాసం ఉంటుంది. ఎన్నికల్లో పోటీచేసినప్పుడు నామినేషన్ వేసేటప్పుడు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, గవర్నర్ పదవి చేపట్టినప్పుడు ముందుగా ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. టేకుతో చేసిన భారీ రథాన్ని(దీని విలువ సుమారు రూ.18 లక్షలు) దేవస్థానానికి అందజేశారు. ఎల్లమ్మ కల్యాణమహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని ఈ రథంపైనే పురవీధుల్లో ఊరేగిస్తారు.
సచివాలయం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలకు..
రవీంద్రభారతి అంటే ఎనలేని ప్రేమ కనబరిచేవారని సాహితీవేత్తలు చెబుతున్నారు. మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ హోదాలో సాంస్కృతిక కార్యక్రమాలు, సాహితీ సదస్సులకు తరచూ హాజరయ్యేవారు. సెక్రటేరియట్‌లో పనులు ముగించుకుని రవీంద్రభారతికి చేరుకునేవారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు నిత్యం ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై నుంచే రాకపోకలు సాగించేవారు. పైవంతెన దుస్థితిని గుర్తించి అధికారులకు చెప్పి వెంటనే మరమ్మతులు చేయించారు. గాంధీ ఆసుపత్రి ఓపీ, ఎమర్జెన్సీ భవనాన్ని 2007 పిబ్రవరి 25న ఆర్థిక, వైద్యారోగ్య, కుటుంబసంక్షేమశాఖ మంత్రిగా ఉన్న రోశయ్య, స్థానిక ఎమ్మెల్యే టి.పద్మారావుతో కలిసి ప్రారంభించారు.
ఇదీ చదవండి: Konijeti Rosaiah : రాజకీయ ఘనాపాటి కొణిజేటి.. నొప్పించక తానొవ్వని తత్వం