Harish Rao on Booster dose: కొవిడ్ బూస్టర్ డోసుపై కేంద్రం అనుమతి నేపథ్యంలో వచ్చే నెల 3 నుంచి మూడో డోసు ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి గురించి ఉన్నతాధికారులు సమావేశంలో వివరించారు. రాష్ట్రంలో నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు, వారి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స గురించి తెలిపారు. వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రభావం తక్కువ ఉందని చెప్పారు. ఒమిక్రాన్ సోకి టిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని, కోలుకుంటున్నారని సమీక్షలో అధికారులు వివరించారు.
70 లక్షల టీకాలు
Booster dose: వివిధ దేశాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 15 నుంచి 18 ఏళ్ల వయసు వారు 22.78 లక్షల మంది, 60 ఏళ్ల పై బడిన వారు 41.60 లక్షల మంది, హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వారియర్లు 6.34 లక్షలు ఉన్నారని తెలిపారు. వీరందరికీ దాదాపు 70 లక్షల వ్యాక్సిన్లు అవసరం ఉంటుందని... వచ్చే నెల 3 నుంచి 15 - 18 ఏళ్ల మధ్య వయసు వారికి, జనవరి 10 నుంచి 60 ఏళ్ల పైబడిన వారికి టీకా ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ మూడో దశ ఉద్ధృతమైనా ఎదుర్కొనేలా ప్రభుత్వం ఇప్పటికే చేసిన ఏర్పాట్లను విభాగాల వారీగా సమీక్షించుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అవసరమైన అదనపు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదుపులోనే ఉంది
'రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది. జాతీయస్థాయిలో మొదటి డోసు సగటు 90 శాతం ఉండగా.. రాష్ట్రంలో 99.46 శాతం పూర్తైంది. రెండో డోసు విషయంలో జాతీయ సగటు 61 శాతం ఉండగా.. రాష్ట్ర సగటు 64 శాతం ఉంది. జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల వారికి.. 10 వ తేదీ నుంచి 60 ఏళ్లు దాటినవారికి వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటు చేయాలి. మూడో దశ వచ్చినా ఎదుర్కొనేలా అధికారులు సన్నద్ధం కావాలి.' - హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
నిర్లక్ష్యం తగదు
Covid vaccination in Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వాక్సినేషన్‌పై దృష్టి సారించడంతో మొదటి డోసు లక్ష్యం దాదాపుగా వంద శాతానికి చేరువ అయిందని హరీశ్ రావు అన్నారు. ఇదే స్ఫూర్తితో రెండో డోసును వంద శాతం పూర్తి చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ రెండు డోసులూ వేసుకోవాలని... రెండో డోసు విషయంలో మరింత వేగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందన్న మంత్రి... అలా అని ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకూడదని కోరారు. వ్యాక్సిన్ వేసుకోవడంతో పాటు మాస్కు ధరించాలని, చేతులు శానిటైజ్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో విస్తరిస్తున్న ఒమిక్రాన్ ... ఐదు కేసులు నమోదు