హైదరాబాద్‌కు చెందిన రమ్యప్రియ తమిళనాడులోని పెరియార్ యూనివర్సిటీలో 2012లో బీబీఏ పూర్తి చేసింది. డిగ్రీ అయిపోయాక తల్లి పద్మావతి నిర్వహిస్తున్న ట్రావెల్ సంస్థలో పనిచేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలో కొంత మంది వినియోగదారులు ఇప్పుడున్న వాహనాలలో అదనంగా మరికొన్ని సౌకర్యాలు ఉంటే బాగుంటుందని కోరేవారు.
అవసరం నుంచి పుట్టిన ఆలోచన
కారు అద్దెకు తీసుకుని దూర ప్రాంతాలకు ప్రయాణిస్తున్న సమయంలో చివరి వరకు కూర్చోలేక ఇబ్బంది పడుతున్నామని, పడుకునేందుకు అనువుగా, వాష్‌రూంతో కూడిన కారు ఉంటే బాగుంటుందని చెప్పేవారు. అవన్నీ విన్న రమ్య అలాంటి వాహనాలను ఎందుకు తయారు చేయకూడదని ఎప్పుడూ ఆలోచించేది. భారతదేశంలో ఇటువంటి వాహనాలు తయారు చేయడానికి అనువైన శిక్షణ సంస్థలు ఉన్నాయని తెలుసుకుని, దిల్లీలోని ఎరోనాక్ సంస్థలో చేరింది. ‘ఆటోమోటివ్ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ మాడిఫికేషన్’ అనే అంశంలో మూడు నెలలు తర్ఫీదు పొందింది.
ఫెడరల్ బైక్
సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ముందుగా చిన్న బైక్‌ల తయారీ మొదలుపెట్టాలని నిర్ణయించుకుంది. అలా వచ్చిన ఆలోచనే ఫెడరల్ బైక్. దీన్ని రూపొందించడానికి కావాల్సిన పరికరాలు దిల్లీలో కొనుగోలు చేసి, మూడు నెలలు శ్రమించి ఎట్టకేలకు తయారు చేసింది.
మూడు గంటల ఛార్జింగ్‌తో 40 కిమీ ప్రయాణం
ఈ బైక్‌ను మూడు గంటల పాటు ఛార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. అదీ కేవలం 6 రూపాయల ఖర్చుతోనే. మెట్రో స్టేషన్లలోనూ దీనికి ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం ఉంది. ప్రయాణిస్తున్న సమయంలో దానికదే ఛార్జింగ్ అవుతుంది.
ఫెడరల్ బైక్ @ రూ.23 వేలు
దీన్ని పెట్రోల్‌తోనూ నడిపించవచ్చు. బైక్‌లో ఇంధనం లేకుంటే సైకిల్‌లా తొక్కుకుంటూ వెళ్లొచ్చు. ప్రస్తుతం ఎలక్ట్రికల్ వాహనాల ధర రూ.70 వేల నుంచి 80 వేల వరకు ఉంది. ఈ బైక్ మాత్రం రూ.23 వేలల్లో లభిస్తుంది. ఈ బైక్ మరికొన్ని నెలల్లో మార్కెట్‌లోకి రానుంది. ‘పోస్టుమేన్, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువులను ఇళ్లకు చేర్చే బాయ్స్, ఇతర సామగ్రి సరఫరా చేసేవారికి ఉపయుక్తంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ బైక్‌ను తయారు చేశానని రమ్యప్రియ తెలిపారు.
- ఇదీ చూడండి : వాషింగ్టన్లో కారులే పడవలయ్యాయి..!