తెలుగు అకాడమీ డిపాజిట్ల కుంభకోణం కేసులో నిందితులు.. ఆ సొమ్ముతో స్థిరాస్తులు కొనుగోలు చేశారు (Telugu Akademi FD Scam ). కీలక నిందితుడు సాయి కుమార్ పెద్ద అంబర్ పేట వద్ద 28 ఎకరాల భూమిని పదేళ్ల క్రితం కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఆ భూమి విలువ దాదాపు రూ.250 కోట్ల వరకు ఉంటుంది. ఆ భూమి వివాదంలో ఉండటంతో... పరిష్కారం కోసం ఇటీవల రూ.5కోట్లు ఖర్చు చేశాడు.
తెలుగు అకాడమీ డిపాజిట్లలో తన వాటాగా వచ్చిన రూ.20 కోట్ల నుంచి 5 కోట్లు ఖర్చు చేసినట్లు సాయి కుమార్ సీసీఎస్ పోలీసుల వద్ద తెలిపాడు (Telugu Akademi FD Scam). దీంతో పెద్దఅంబర్‌పేట్‌లో ఉన్న 28ఎకరాల భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
తమ వాటాగా వచ్చిన మొత్తంతో..
యూబీఐ చీఫ్ మేనేజర్ మస్తాన్ వలీ యూసూఫ్‌గూడలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశాడు. ఆ ఫ్లాట్‌ను ఇతరులెవరికీ అమ్మకుండా సీసీఎస్ పోలీసులు చర్యలు చేపట్టారు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధన... శంకర్‌పల్లిలో కోటి రూపాయలతో భూమిని కొనుగోలు చేశారు. మరో 40లక్షలతో వైజాగ్‌లో ఫ్లాట్ కొన్నారు. వీటిపైనా పోలీసులు దృష్టి పెట్టారు. మిగతా నిందితులు కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించే పనిలో సీసీఎస్ పోలీసులు నిమగ్నమయ్యారు.
మరోసారి కస్టడీ కోరిన సీసీఎస్ పోలీసులు
తెలుగు అకాడమీ కేసులో సీసీఎస్ పోలీసులు మొత్తం 17మందిని అరెస్ట్ చేశారు. వీళ్లలో 14మంది నిందితులను సీసీఎస్ పోలీసులు ఇప్పటికే కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు (Telugu Akademi FD Scam ). నిందితులు సరైన సమాధానం చెప్పకపోవడంతో మరోసారి కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. సోమవారం దీనిపై వాదనలు జరగనున్నాయి.
ఒక్కొక్కరిగా అరెస్ట్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో పరారీలో ఉన్న కృష్ణారెడ్డిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. డిపాజిట్ల గోల్‌మాల్‌లో సాయికుమార్, కృష్ణారెడ్డి కీలకపాత్ర వహించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు. కృష్ణారెడ్డి స్వస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరు కాగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో నివాసముంటున్నారని పోలీసులు తెలిపారు.
సాయి కుమార్‌తో కలిసి డిపాజిట్లు కొల్లగొట్టడంలో కృష్ణారెడ్డి కుట్ర పన్నినట్లు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. తెలుగు అకాడమీతో పాటు ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ సీడ్స్ కార్పొరేషన్‌లోనూ రూ.15 కోట్లకు పైగా డిపాజిట్లను కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. డిపాజిట్ల గోల్‌మాల్‌లో తన వాటాగా కృష్ణారెడ్డి ఆరు కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉండగా.. 3.5 కోట్లు తీసుకున్నట్లు విచారణలో అంగీకరించినట్లు వెల్లడించారు. గతంలో ఏపీ వేర్‌హౌసింగ్‌లో రూ.10 కోట్ల గోల్‌మాల్, ఏపీ సీడ్స్ కార్పొరేషన్‌లో రూ.5 కోట్ల గోల్‌మాల్‌లో కృష్ణారెడ్డి పాత్ర ఉంది. కృష్ణారెడ్డి తీసుకున్న సొమ్మును ఎక్కడికి మళ్లించారనే విషయాలపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి: Telugu Academy Case: తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో మరో నిందితుడి అరెస్టు