Telangana Geography: కొలువుల జాతరకు నిరుద్యోగులు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోటీ పరీక్షల కోసం పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలుగు అకాడమీ సమాయత్తమవుతోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ‘తెలంగాణ ప్రాంతీయ భూగోళశాస్త్రం’ పుస్తకాన్ని రూపొందించిన అకాడమీ.. జిల్లాల సంఖ్య 33కి పెరిగిన నేపథ్యంలో ఆ మేరకు మార్పులు, చేర్పులు చేసి మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఇప్పటికే ఆంగ్ల మాధ్యమ ప్రతి ముద్రణకు వెళ్లగా.. మరికొద్ది రోజుల్లో తెలుగు మాధ్యమ పుస్తకాన్ని ముద్రణకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు పుస్తకం మరో నెల రోజుల్లో అందుబాటులోకి వస్తుందని అకాడమీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు పోటీ పరీక్షల కోసం దాదాపు 50 పుస్తకాలను అకాడమీ ముద్రించింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఉద్యమం-రాష్ట్ర అవతరణ, తెలంగాణ ప్రాంతీయ భూగోళశాస్త్రం, ఆర్థికాభివృద్ధి- పర్యావరణం, చరిత్ర-సంస్కృతి తదితర పుస్తకాలతోపాటు బీఏ విద్యార్థుల కోసం రూపొందించిన చరిత్ర, ఆర్థికశాస్త్రం పుస్తకాలకు మంచి డిమాండ్ ఉందని చెబుతున్నారు. అకాడమీకి హైదరాబాద్‌తోపాటు వరంగల్, సంగారెడ్డి, సిద్దిపేటలలో ప్రాంతీయ పుస్తక విక్రయ కేంద్రాలున్నాయి. మరోవైపు పుస్తకాలను పునఃముద్రించేందుకు అకాడమీ వద్ద ‘కాగితం’ అందుబాటులో లేదు. ఆ ప్రక్రియ టెండర్ దశలో ఉంది.
సంచాలకుడిని నియమిస్తేనే..
ఉద్యోగ పరీక్షల నేపథ్యంలో తెలుగు అకాడమీకి పని పెరగనుంది. కొత్త పుస్తకాలను ముద్రించడం, డిమాండ్ ఉన్న వాటిని పునఃముద్రణ చేయడం తదితర పనులు చేయాలంటే పూర్తిస్థాయి సంచాలకుడు అవసరం. ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఒకే సమయంలో ఈ రెండు విభాగాలను పర్యవేక్షించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: