రాష్ట్రంలో ఒకటి, రెండుచోట్ల ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎల్లుండి మాత్రం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లే ప్రక్రియ నల్గొండ వరకు కొనసాగిందని పేర్కొన్నారు. ఆదివారం ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం.. తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిందని తెలిపారు. ఇదే సమయంలో ఉపరితల ద్రోణి మరింత బలహీన పడిందని వాతావర కేంద్రం సంచాలకులు వివరించారు.
నిన్న, మొన్న వర్షాలు
హైదరాబాద్ పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఎల్‌బీనగర్, చింతలకుంట, దిల్సుఖ్నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. వనస్థలిపురం, కిస్మత్‌పూర్, అత్తాపూర్, రాజేంద్రనగర్, గండిపేట, బండ్లగూడ, శంషాబాద్, లంగర్ హౌస్, గోల్కొండ, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడ్డాయి. నగరంలోని పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే.
అప్రమత్తమైన యంత్రాంగం
జంట నగరాల్లో పలు ప్రదేశాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్న దృష్ట్యా... జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని సిబ్బందిని మోహరించింది. ఈ సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని... ఆయా ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
సంబంధిత కథనాలు: